సిరిసిల్ల: అర్బన్ నక్సల్స్‌ను నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం(నవంబర్ 18వ తేదీ) రాజన్న సిరిసిల్ల పర్యటనకు వచ్చిన బండి సంజయ్ వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు తక్షణమే తుపాకులు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు.
‘ మావోయిస్టులారా... అర్బన్ నక్సల్స్ నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. అర్బన్ నక్సల్స్ పట్టణాల్లో జల్సా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పైరవీలు చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్నారు. వాళ్ల మాటలు నమ్మి అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలు లేక తిరుగుతున్నారు. మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు. నక్సల్స్ కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులు. తక్షణమే తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవండి. మీకు మరో 4 నెలలు మాత్రమే గడువు. వచ్చేమార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేసి తీరుతాం’ అని హెచ్చరించారు.
కాగా, రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
మృతుల్లో లక్మల్, కమ్లూ, మల్లా, దేవ్(హిడ్మా గార్డ్) ఉన్నారు. హిడ్మా మృతిని అటు ఛత్తీస్‌గఢ్ పోలీస్ శాఖతో పాటు ఇటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హా ధృవీకరించారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా.. మూడు రాష్ట్రాలకు మోస్ట్‌వాంటెడ్‌గా మారారు. భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్‌గా మారారు. ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా బలగాల నుంచి తప్పించుకున్నారు. అయితే తాజా దాడుల్లో హిడ్మా మృతిచెందారు.
ఇదిలా ఉంచితే, విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది. దాంతో మావోయిస్టులకు దెబ్బమీద దెబ్బ తగిలినట్లయ్యింది.


