
కరీంనగర్: నక్సల్స్(మావోయిస్టులు) ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్లను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఈరోజు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) కరీనంగర్‌లో నక్సల్స్ నరమేధం-మేథోమథనం చర్చలో బండి సంజయ్ పాల్గొన్నారు.
దీనిలో భాగంగా నక్సల్స్ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళులర్పించారు బండి సంజయ్. అనంతరం మాట్లాడుతూ.. నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. నక్సల్స్‌తో చర్చలు జరిపిన వారు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు.
‘తూపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊర్కోవాలా?, నక్సల్స్ తూటాలకు 50 వేల మంది బలి అయ్యారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేశారు. నక్సల్స్‌కు మద్దతిస్తున్న వారికి విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?, ఎంతో మందిని నక్సల్స్ చంపినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా?, జాతీయ జెండాను ఎగరనీయని నక్సలైట్లు ఏ దేశ భక్తులు?, బాక్సైట్ తవ్వకాల కోసమే ‘ఆపరేషన్ కగార్’ నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం దుర్మార్గం.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు గనుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి కదా?, బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తాం. 2026 మార్చినాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.