
సొసైటీల పరిధిలోని 454 దుకాణాల ఎత్తివేత, అలాగే టీఎఫ్‌టీ లైసెన్స్‌లు రద్దు
ఎక్సైజ్ శాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం?
కల్తీ కల్లును అరికట్టడానికి అధికార యంత్రాంగం సూచన!
సాక్షి, హైదరాబాద్: కల్లుపై నిషేధాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి మొత్తం ప్రాంతాన్ని చేర్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ నుంచి పూర్తి వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ కల్లు దుకాణాలకు అవసరమైన చెట్లు లేకపోవడం వల్ల వ్యాపారులు అల్ప్రాజోలమ్ వినియోగించి కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు అధికారవర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. ఈ మధ్య కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి 10 మంది మరణించడం ఎక్సైజ్ శాఖను కుదిపేసింది.
ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై చర్యలు తీసుకున్నా.. కల్తీ కల్లు కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తప్పదన్న నిశి్చతాభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. ఔటర్ రింగ్ రోడ్డులోపల ఎన్ని దుకాణాలు ఉన్నాయ న్న సమాచారంతో పాటు దానిపై ఆధారపడి ఉన్న వారి వివరాలను కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని మల్కాజి గిరి, మేడ్చల్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలోని కల్లు దుకాణాల ఎత్తి వేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కల్తీ కల్లు కారణంగా పది మంది మరణించడం ప్రభుత్వానికి మచ్చగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఓఆర్‌ఆర్ లోపల 390 సంఘాలు, 454 దుకాణాలు
ఔటర్ రింగ్ రోడ్డు లోపల తాటి కో ఆపరేటివ్ సోసైటీలు.. హైదరాబాద్‌లో 14 ఉండగా, వీటి కింద 53 కల్లు దుకాణాలు, సికింద్రాబాద్‌లో 31 సంఘాల పరిధిలో 50 కల్లు దుకాణాలు, రంగారెడ్డి జిల్లాలోని మల్కాజిగిరిలో 77 సంఘాల కింద 79 దుకాణాలు, మేడ్చల్ పరిధిలో 50 సంఘాల కింద 52 కల్లు దుకాణాలు, సరూర్‌నగర్ పరిధిలో 158 సంఘాల కింద 158 దుకాణాలు శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలు ఉన్నాయి.
మొత్తం 390 సంఘాల కింద 454 కల్లు దుకాణాలు ఉన్నట్లు ఎక్సైజ్‌శాఖ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ 454 కల్లు దుకా ణాలను పూర్తిగా ఎత్తేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దుకాణాల మూతతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న టీఎఫ్‌టీ (ట్రీఫర్ ట్రేడ్) లైసెన్స్‌లు కూడా రద్దు అయ్యే అవకాకాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరో పక్క ఎక్సైజ్, పోలీసులు, టీజీ న్యాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ నిఘా సంస్థలు కల్తీ కల్లు తయారుకు వినియోగించే అ్రల్ఫాజోలమ్, హైడ్రో క్లోరైడ్, డైజో ఫామ్ లాంటి నిషేధిత రసాయనాలను పూర్తిగా అరికట్టలేక పోతుండడంతో ప్రభుత్వం ఓఆర్‌ఆర్ పరిధి లోపల కల్లు అమ్మకాలను నిషేధించాలని భావిస్తున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెపుతున్నాయి.