
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (బీజీయూఎస్) నిర్వాహకులు పంపించిన ఆహ్వానంపై అమిత్ షా కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం సానుకూల స్పందన వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. దీని ప్రకారం అమిత్ షా శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఆయన బసచేస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు బీజీయూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు.
ఈ పర్యటనలో భాగంగానే.. ఐటీసీ కాకతీయ హోటల్ నుంచే ఎస్‌ఎస్‌బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌కు అమిత్ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు మొజంజాహీ మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అమిత్ షా తిరుగు ప్రయాణమవుతారు.
గతంలో పాల్గొన్న ప్రముఖులు..
గతంలో హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాల్లో .. ఉమ్మడి ఏపీ సీఎం డా.మర్రిచెన్నారెడ్డి మొదలు, అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రులు ఉమాభారతి, సాధ్వి రీతంబర, ఆరెస్సెస్ ప్రస్తుత సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, పూర్వ సర్ సంఘ్‌చాలక్‌లు బాలసాహెబ్ దేవరస్, ప్రొ.రాజేందర్‌సింగ్ (రజ్జూభయ్యా), కేఎస్ సుదర్శన్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారని సాక్షికి బీజీయూఎస్ ప్రధానకార్యదర్శి డా. రావినూతల శశిధర్ తెలిపారు.