breaking news
ganesh utsav samithi
-
6న గణేశ్ నిమజ్జనానికి అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (బీజీయూఎస్) నిర్వాహకులు పంపించిన ఆహ్వానంపై అమిత్ షా కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం సానుకూల స్పందన వచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి షెడ్యూల్‌ను ఖరారు చేశారు. దీని ప్రకారం అమిత్ షా శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఐటీసీ కాకతీయ హోటల్లో ఆయన బసచేస్తారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్‌షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత 3 గంటల నుంచి 4 గంటల వరకు బీజీయూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగానే.. ఐటీసీ కాకతీయ హోటల్ నుంచే ఎస్ఎస్బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌కు అమిత్ షా వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:10 నుంచి 4:55 వరకు మొజంజాహీ మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి అమిత్ షా తిరుగు ప్రయాణమవుతారు. గతంలో పాల్గొన్న ప్రముఖులు.. గతంలో హైదరాబాద్‌లో జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాల్లో .. ఉమ్మడి ఏపీ సీఎం డా.మర్రిచెన్నారెడ్డి మొదలు, అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ, కేంద్ర మాజీ మంత్రులు ఉమాభారతి, సాధ్వి రీతంబర, ఆరెస్సెస్ ప్రస్తుత సర్ సంఘ్‌చాలక్ మోహన్ భాగవత్, పూర్వ సర్ సంఘ్‌చాలక్‌లు బాలసాహెబ్ దేవరస్, ప్రొ.రాజేందర్‌సింగ్ (రజ్జూభయ్యా), కేఎస్ సుదర్శన్, వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారని సాక్షికి బీజీయూఎస్ ప్రధానకార్యదర్శి డా. రావినూతల శశిధర్ తెలిపారు. -
12న గణేష్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు కొలిచే గణనాథులకు ఘన వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (చీఫ్) మోహన్ భాగవత్ హాజరుకానున్నారని, స్వామి ప్రజ్ఞానంద యాత్రలో పాల్గొంటారన్నారు. శుక్రవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. చాంద్రాయణగుట్ట, షాలిబండ, చార్మినార్ మీదుగా సాగుతుందని తెలిపారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛత, శుభ్రత పాటించాలని, మండపాల వద్ద గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. సమితి ఆ«ధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక థీమ్ పెట్టుకుంటామని, ఈ యేడు జలియన్ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వదంతులు పుట్టిస్తే దాన్ని నమ్మరాదని సూచించారు. పోలీసులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. వినాయక్‌సాగర్‌లో మహా హారతి.. కాశీ తరహాలో వినాయక్ సాగర్ (ట్యాంక్‌బండ్)లో కూడా మహా హారతి ఇవ్వాలని తాము ప్రతిపాదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాఘవరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిగా సహకరిస్తున్నాయని, యాత్ర పొడువునా నీరు ఏర్పాటు చేసేందుకు వాటర్‌వర్క్స్, లైట్ల ఏర్పాటుకు విద్యుత్ సంస్థ సిద్ధమైనట్లు తెలిపారు. -
'గణేష్ విగ్రహాల ఎత్తు 15 అడుగులే ఉండాలి'
హైదరాబాద్: నగరంలో మెట్రో నిర్మాణం కారణంగా వినాయకుని విగ్రహలు ఈసారి 15 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేలా చూడాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. బుధవారం భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో వినాయక చవితి, నిమజ్జనం ఏర్పాట్లపై చర్చించారు. అదేవిధంగా హైకోర్టు ఆదేశాలను గణేశ్ ఉత్సవ సమితికి ఈ సందర్భంగా వివరించారు. విగ్రహాల తయారీలో మట్టి, సాధారణ రంగులు వాడాలని వారికి రాజీవ్ శర్మ విజ్ఞప్తి చేశారు.