పక్కాగా ‘పోలీస్‌’ పరీక్షలు

All prepared for the final written examination of uniform services posts - Sakshi

యూనిఫాం సర్విసెస్‌ పోస్టుల తుది రాత పరీక్షకు సర్వం సన్నద్ధం 

బయోమెట్రిక్‌ విధానంలో అభ్యర్థుల హాజరు నమోదు 

11న ఐటీ, కమ్యూనికేషన్‌ ఎస్సై పరీక్షలతో ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసెస్‌ కొలువుల భర్తీలో కీలకమైన తుది రాత పరీక్షల నిర్వహణకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్పీఆర్బీ) పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. అవకతవకలకు తావులేకుండా పూర్తిస్థాయిలో సాంకేతికతను వినియోగిస్తోంది. పోలీస్‌ శాఖతోపాటు ఎక్సైజ్, రవాణా శాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,516 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షను నిర్వహిస్తున్నారు.

అన్ని పోస్టులకు కలిపి దేహదారుఢ్య పరీక్షలకు 2,07,106 మంది అభ్యర్థులు హాజరుకాగా, వీరిలో 1,11,209 మంది తుది రాత పరీక్షలకు ఎంపికయ్యారు. మార్చి 11న తుది రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఆ రోజు ఐటీ, కమ్యూనికేషన్స్‌ ఎస్‌ఐ, ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు పరీక్ష జరగనుండగా, దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

మార్చి 26న పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై తుది రాత పరీక్ష, ఏప్రిల్‌ 2న కానిస్టేబుల్‌ మెకానిక్, డ్రైవర్‌ పోస్టులకు, ఏప్రిల్‌ 8, 9 తేదీల్లో సివిల్‌ ఎస్సై పోస్టులకు, ఏప్రిల్‌ 30న సివిల్‌ కానిస్టేబుల్, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు తుది రాత పరీక్షలు జరగనున్నాయి.  

హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ.. 
అభ్యర్థుల సంఖ్య ఆధారంగా రాత పరీక్షలకు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్‌ ఎస్సై, ఫింగర్‌ప్రింట్‌ ఏఎస్సై, పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌ ఎస్సై, కానిస్టేబుల్, మెకానిక్‌వంటి పోస్టుల అభ్యర్థులకు హైదరాబాద్‌లోనే కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సివిల్‌ ఎస్సైలకు హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్‌ జిల్లాల పరిధిలో నిర్వహించనున్నారు. పెద్దసంఖ్యలో అభ్యర్థులు పాల్గొనే కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షలు హైదరాబాద్‌తోపాటు పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top