కాదేదీ ఎన్నికల గుర్తుకు అనర్హం
జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో 58 మంది
అభ్యర్థులకు చిత్రవిచిత్ర గుర్తుల కేటాయింపు
హైదరాబాద్: అగ్గిపెట్టె, సబ్బుపెట్టె, పండ్లబుట్ట, ఇటుక, కత్తెర, గాజు.. ఇవన్ని ఏమిటని అనుకుంటున్నారా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు ఉండగా 3 ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కనబెడితే మిగతావారికీ గుర్తుల కేటాయింపు ఎన్నికల అధికారులకు సవాల్‌గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండడంతో రకరకాల గుర్తులను తీసుకోవాల్సి వచ్చింది.
ఇందులో ఇటుకలతో పాటు కత్తెర, గాజులు కూడా కేటాయించారు. సీసీ టీవీ కెమెరా, కూలర్, బెలూన్, ల్యాప్‌ట్యాప్, టీవీ రిమోట్, డిష్ యాంటెనా, డోలి, సైకిల్‌కు గాలి కొట్టే పంపు, బెల్టు, హెల్మెట్, బేబీ వాకర్, ఆపిల్, ద్రాక్ష.. ఇలా చిత్ర విచిత్రంగా గుర్తులు కేటాయించారు. జూబ్లీహిల్స్‌లో ఇప్పటివరకు 58 మంది అభ్యర్థులు పోటీపడిన దాఖలాలు లేవు. ఇందులో 50 మందికి పైగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వారిక గుర్తుల కేటాయింపు ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది.
ఈసారి ప్రెషర్ కుక్కర్, చపతీ రూలర్, బ్రీఫ్‌కేస్, ఉంగరం, వజ్రం, బైనోక్యూలర్స్.. ఇన్నో ఎన్నో రకాల గుర్తులను కేటాయించారు. ఇక అభ్యర్థులు తమ గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి బెల్టు కూడా ఓ అభ్యర్థికి గుర్తుగా వచి్చంది. గుర్తులను సేకరించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. ఎంతో వడబోసి చివరకు గుర్తులను సేకరించి కేటాయించి హమ్మయ్యా..! అంటూ ఊపిరిపీల్చుకున్నారు.


