
రోడ్ల సౌకర్యం లేని జీపీలు, అక్కడి నుంచి మండలాలు, జిల్లా కేంద్రాలకు రహదారులు
ప్రతిపాదిత రోడ్లకు సంబంధించి ఉమ్మడి 9 జిల్లాల్లో 4 వేల కి.మీ. సర్వే పూర్తి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతోపాటు వాటి ఆధునీకరణకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హామ్) విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికీ రోడ్ల సౌకర్యం లేని గ్రామ పంచాయతీలకు రహదారి నిర్మాణం చేపట్టడంతోపాటు, జీపీల నుంచి మండల కేంద్రాలను కలుపుతూ జిల్లా కేంద్రాలకు అనుసంధానించే రహదారుల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం కర్ణాటక, రాజస్తాన్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ విధానం అమలవుతోంది. దీనిని అమలు చేయడం ద్వారా త్వరితగతిన గ్రామీణ రహదారుల నిర్మాణం పూర్తి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ ప్రాజెక్టు కింద 17,300 కి.మీ. పొడవు గల పంచాయతీరాజ్ రోడ్లు 12 వేల కి.మీ. పొడవు గల ఆర్‌అండ్‌బీ రోడ్లను చేపట్టాలని నిర్ణయించారు. దీనిని చేపట్టేందుకు పీఆర్ ఇంజనీరింగ్ విభాగాన్ని నోడల్ విభాగంగా, కనీ్వనర్‌గా ఈఎన్సీ పంచాయతీరాజ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల నిర్మాణానికి సంబంధించి కొంత వాటాను ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన వాటాను టెండర్ దక్కించుకునే కంపెనీలే భరించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం నుంచి ఎటువంటి గ్యారంటీ ఉండదు. పదిహేనేళ్లపాటు సదరు కంపెనీ నిర్వహణ బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రణాళిక, సాంకేతిక, ఆరి్థక, న్యాయపరమైన అంశాల అధ్యయనానికి... ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లుగా ఆర్వీ అసోసియేట్స్, ఎల్‌ఈఏ అసోసియేట్స్‌ను టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసింది.
సిద్ధమవుతున్న డీపీఆర్‌లు
హామ్ ప్రాజెక్ట్ కోసం డీపీఆర్‌లను కన్సల్టెంట్లు సిద్ధం చేస్తున్నారు. దానికి అనుగుణంగా బడ్జెట్ రూపొందించి కేబినెట్ ఆమోదం తీసుకుంటారు. దీనిపై కేబినెట్‌లో చర్చించాక ఈ ప్రాజెక్టు విధివిధానాల ఖరారు కానున్నట్టు పీఆర్ అధికారుల సమాచారం. అయితే సమయం వృథా కాకుండా సమాంతరంగా సర్వే కొనసాగుతోందని, ప్రతిపాదిత రోడ్లకు సంబంధించి ఉమ్మడి 9 జిల్లాల్లో ఇప్పటికే నాలుగు వేల కి.మీ. మేర సర్వే పూర్తయినట్టు వారు వెల్లడించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆమోదం పొందాక రహదారుల ప్రతిపాదనలను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఖరారు చేస్తారు.
ఈ ప్రాజెక్ట్‌ను మూడుదశల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జనవరిలో మొదటి దశ పనులు, 2026 మార్చిలో రెండవదశ, 2026 జూన్‌లో మూడవ దశ నిర్మాణ పనులు ప్రారంభించాలని అనుకుంటున్నారు. తదనుగుణంగా కన్సల్టెంట్‌లు, అధికారులు అంచనాలు తయారు చేసి టెండర్లు, ఒప్పందాలు వివిధ పనులను త్వరితగతిన చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచనలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆయా అంశాలను పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఇందులో భాగంగా ఖరారైన రహదారుల నిర్మాణ పనులను జనవరి 2026న ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత టెండర్ ప్రక్రియను పంచాయతీరాజ్ శాఖ మొదలుపెట్టనుంది. ఇందుకు అనుగుణంగా నిర్దేశిత గడువులోపు హామ్ పనులు చేపట్టి పూర్తి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. హామ్ పనుల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫీస్‌లో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు సమాచారం.