
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారుల వెల్లడి
పూర్తి నివేదిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆర్ అండ్ బీ శాఖ రోడ్లకు సుమారు రూ.1,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధికారులు నివేదించారు. రోడ్లతోపాటు పలుచోట్ల కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్‌లు, హైవే స్ట్రెచ్‌లు దెబ్బతిన్నట్లు చెప్పారు. రోడ్లకు జరిగిన నష్టంపై గురువారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. వర్షాల కారణంగా రహదారులకు జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రస్తుత పరిస్థితిపై ఫీల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని సూచించారు. పూర్తిగా శిథిలావస్థకు చేరిన కల్వర్టులు, మైనర్ బ్రిడ్జ్‌ల స్థానంలో కొత్తగా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. త్వరలోనే హ్యామ్ విధానం ద్వారా నాణ్యమైన రోడ్లు వేయబోతున్నట్లు వెల్లడించారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఆ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన జాతీయ ప్రాజెక్టులపై మంత్రి ఆరా తీశారు. ఖానాపూర్ నుంచి బెల్లంపల్లి, ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్ రోడ్డు మార్గంపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఇచ్చిన వినతి పత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్, ఈఎన్సీ జయ భారతి, సి.ఈ రాజేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఈ ధర్మారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను డర్టీ పార్టీ అనడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని దూషించటం బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా? అని గురువారం ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నిలబెట్టిన ఉప రాష్ట్రపతి అభ్యర్థిని చూసి దేశం మొత్తం హర్షిస్తోందని తెలిపారు. తెలంగాణ బిడ్డను వ్యతిరేకిస్తే బీఆర్‌ఎస్‌ను తెలంగాణ ప్రజలు క్షమించబోరని హెచ్చరించారు.