గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒక్కరోజే 397 కరోనా కేసులు!! | 397 Corona Cases In Greater Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 397 కరోనా కేసులు!!

Jan 4 2022 8:16 AM | Updated on Jan 4 2022 8:29 AM

397 Corona Cases In Greater Hyderabad  - Sakshi

గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షల కోసం మహిళల నిరీక్షణ

సాక్షి హైదరాబాద్‌: గ్రేటర్‌జిల్లాల్లో మరోసారి కోవిడ్‌ విజృంభిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే 482 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో 397 పాజిటివ్‌ కేసులు నమోదు కావడం గమనార్హం. డిసెంబర్‌ మూడో వారం వరకు రోజుకు సగటున వందలోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్‌ వేడుకలు, డిసెంబర్‌ 31 తర్వాత వైరస్‌ మరింత వేగంగా విస్తరించింది. గతంలో ఎన్నడూ లేనంతగా కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. 

సరిహద్దు రాష్ట్రాల రోగులపై నిఘా.. 
డెల్టా సహా ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు మరింత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే మహారాష్ట్ర, ఇతర సరిహద్దు రాష్ట్రాల బాధితులు చికిత్స కోసం నగరానికి చేరుకుంటున్నారు. వీరికి సహాయంగా వచ్చిన బంధువులు సాధారణ రోగుల మధ్యే తిరుగుతున్నారు. వీరి ద్వారా ఇతర రోగులకు కూడా వైరస్‌ విస్తరిస్తుండటంతో పోలీసులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులపై నిఘా పెట్టారు. రోగులు, వారి సహాయకులు బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

విదేశాల నుంచి వచ్చిన 23 మందికి.. 
విదేశాల నుంచి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 423 మందిలో 23 మందికి కోవిడ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారిని టిమ్స్‌కు తరలించారు. వీరికి ఏ వేరియంట్‌ సోకిందో తెలుసుకునేందుకు వారి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్‌ సీక్వెన్సీ పరీక్షలకు పంపారు. ప్రస్తుతం 53 శాంపిల్స్‌కు  సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement