ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు కావాలి | 11 thousand crores are needed for the projects | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులకు రూ.11 వేల కోట్లు కావాలి

Jul 18 2024 4:15 AM | Updated on Jul 18 2024 4:15 AM

11 thousand crores are needed for the projects

ఆర్థిక శాఖను కోరనున్నామన్నమంత్రి ఉత్తమ్‌

ఈ ఏడాది పూర్తయ్యే ప్రాజెక్టులు ఏ–కేటగిరీలో

ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులకు గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11 వేల కోట్లను రాష్ట్ర తుది బడ్జెట్‌లో కేటాయించాల్సిందిగా ఆర్ధిక శాఖకు ప్రతిపాదనలు అందించనున్నట్లు నీటి పారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

మధ్యంతర బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు రూ.28 వేల కోట్లను కేటాయించగా, అందులో రూ.18 వేల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకే పోనున్నాయని, రూ.2 వేల కోట్లు వేతనాలు, ఇతర ఖర్చులకు పోగా ఇక రూ.8 వేల కోట్లు మాత్రమే ప్రాజెక్టుల పనులకు మిగులుతాయని చెప్పారు. పనులు జరగాలంటే రూ.11 వేల కోట్లు అవసరమని పేర్కొన్నారు. 

ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆ దిశగా పనులు ముమ్మరం చేస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యే ప్రాజెక్టులను ఏ– కేటగిరీలో చేర్చాలని ఆదేశించామని తెలిపారు. 

2025లోగా పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి
పెండింగ్‌లో ఉన్న నీల్వాయి, పాలెంవాగు, మత్తడివాగు, పింప్రి, సదర్మట్, చిన్నకాళేశ్వరం (ముక్తేశ్వర్‌), దేవాదుల, చనాకా కొరాటా, పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్, కొడంగల్‌–నారాయణపేట, అచ్చంపేట, ఎస్‌ఎల్బీసీ, సీతారామ, ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకు న్నామని మంత్రి తెలిపారు. ఇక 2025 మార్చి లేదా డిసెంబర్‌ లోపు కోయిల్‌ సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులను పూర్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నామని చెప్పారు. 

గోదావరి– కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మిస్తామని నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనపై శాసనసభ సమావేశాల్లో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌ చెప్పారు. నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను న్యాయనిపుణుల సలహా తీసుకున్నాక చేపడతామని తెలిపారు. 

సదర్మట్, రాజీవ్‌ కెనాల్‌ రెడీ: ఈ నెలాఖరున సదర్మట్‌ ప్రాజెక్టుతో పాటు ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టులో భాగంగా కట్టిన రాజీవ్‌ కెనాల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని ఉత్తమ్‌ తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సదర్మట్‌ ప్రాజెక్టులో మిగిలిన పనులన్నీ సత్వరం పూర్తి చేయాలన్నారు. సమావే శంలో నీటి పారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌ దాస్, శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, ఈఎన్సీ (జనరల్‌) జి.అనిల్‌కుమార్, డిప్యూ టీ ఈఎన్సీ కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

20న ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌తో ఉత్తమ్‌ భేటీ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) అధికారులతో చర్చించడానికి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 20న ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదిక అమలు, తుది నివేదికపై ఆ సంస్థ చైర్మన్‌ అనిల్‌ జైన్‌తో సమావేశం కానున్నారు. 

మధ్యంతర నివేదిక అమల్లో పురోగతిపై  బుధవారం మంత్రి ఉత్తమ్‌ జలసౌధలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్‌ జైన్‌తో  ఫోన్లో మాట్లాడారు. నివేదికలో చేసిన సిఫారసుల మేరకు వానాకాలానికి ముందు బరాజ్‌ల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలు పూర్తి చేశామని చెప్పారు. కాగా తుది నివేదికను సత్వరం అందించాలని మంత్రి కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement