సాక్షి, చైన్నె: శ్రీపెరుంబుదూర్ సమీపంలోని మగన్యం గ్రామంలో నిర్వహిస్తున్న రాతి క్వారీని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు, విద్యార్థులు కాంచీపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. క్వారీలో జరుపుతున్న భారీ పేలుళ్ల వల్ల తమ ఇళ్లు దెబ్బతింటున్నాయని, పంట భూములు నాశనమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మగన్యం గ్రామంలో ఇటీవల కొత్తగా ఒక రాతి క్వారీని ప్రారంభించారు. అక్కడ రాళ్లను పగలగొట్టడానికి నిత్యం భారీ ఎత్తున పేలుళ్లు జరుపుతుండటంతో సమీపంలోని నివాస గహాల గోడలకు పగుళ్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, పేలుళ్ల సమయంలో ఎగిరే దుమ్ము, ధూళి పరిసర ప్రాంతాల్లో పేరుకుపోవడంతో సుమారు 250 ఎకరాల వ్యవసాయ భూమి సాగుకు పనికిరాకుండా పోతోందని రైతులు వాపోతున్నారు.
కలెక్టర్ కార్యాలయం ముట్టడి
ఈ సమస్యపై ఫిర్యాదు చేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్థులు, విద్యార్థులు కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రజాసయోధ్య కేంద్రం సమావేశ మందిరంలో నేలపై బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను ముట్టడించి తమ నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారుల సూచన మేరకు నిరసనకారుల తరఫున నలుగురు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ జీవనోపాధికి, పంట భూములకు తీవ్ర నష్టం కలిగిస్తున్న క్వారీ అనుమతులను రద్దు చేసి, దానిని మూసివేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, క్వారీలో వినియోగిస్తున్న పేలుడు పదార్థాల పరిమాణంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇళ్లు , వ్యవసాయ భూములకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు.


