తమిళసినిమా: ఇటీవల కథానాయికల పాత్రల పరిధి, నటన గురించి విమర్శలు ఎదురౌతున్న విషయం తెలిసిందే. కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌లను గ్లామర్ డాల్ గానే చూపిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల తెలుగు చిత్రం పెద్ది లో జాన్వీ కపూర్ పాత్ర, ఆమెను తెరపై ఆవిష్కరించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. దానికి ఆ చిత్ర దర్శకుడు వివరణ ఇచ్చారు కూడా. కాగా ఇలాంటి అంశంపై సంచలన నటి నిత్యామీనన్ తన భావాలను తన సామాజిక మాధ్యమంలో స్పందించారు. ఆమె పేర్కొంటూ ‘‘ ప్రతి కథానాయకి చిత్రాల్లో తమ పాత్రల విషయంలో, నటన విషయంలో పరిధులు విధించుకోవాలి. తమను ఒక వస్తువుగా చూడటం సహేతం కాదు అనే విషయంలో దృఢంగా ఉండాలి. నాకు సంబంధించినంత వరకు నేను నటించడానికి సమ్మతించిన కథా పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అయితే ఇలాంటి విషయాలు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు అంతా నెలకొంది. సినిమా కమర్షియల్‌గా మారడమే ఈ సమస్యలకు కారణం అని నేను భావిస్తున్నాను ‘‘ అని నటి నిత్యామీనన్ పేర్కొన్నారు. కాగా నటుడు ధనుష్ సరసన నటించిన ఇడ్లీ కడై చిత్రం తరువాత ఈ భామ మరో కొత్త చిత్రాన్ని అంగీకరించకపోవడం గమనార్హం.


