వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

సాక్షి, చైన్నె: చైన్నెలో శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌లో శ్రీమెడ్‌కాన్‌ 2026 పేరిట జరిగిన అంతర్జాతీయ సదస్సులో వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. వైద్య విద్యలో అధ్యాపకులను మరింత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూడు రోజుల పాటుగా ఈ సదస్సును నిర్వహించారు. మహారాష్ట్రకు చెందిన దత్తా మేఘే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ లలిత్‌భూషణ్‌ ఎస్‌. వాగ్మారే ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యా నిపుణులు హాజరైన ఈ సదస్సులో వైద్య విద్య భవిష్యత్తును సరికొత్త ఆవిష్కరణలతో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు. ఈ సదస్సులో వైద్య నిపుణులు, పరిశోధకులు, క్లినిషియన్లు, అధ్యాపకులు , పీజీ విద్యార్థులతో కలిపి దాదాపు 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తమ అనుభవాలను, ఉత్తమ విధానాలను పంచుకుంటూ భవిష్యత్తు వైద్య విద్యా విధానానికి ఒక స్పష్టమైన రూపాన్ని ఇచ్చేందుకు సమిష్టిగా కృషి చేశారు.ఈ మూడు రోజుల సదస్సులో వైద్య విద్యా రంగంలో పెరుగుతున్న పరిశోధనలకు అద్దం పడుతూ 108 సైంటిఫిక్‌ ఓరల్‌, పోస్టర్‌ ప్రెజెంటేషన్లను ప్రదర్శించారు. అలాగే సిమ్యులేషన్‌ ఆధారిత విద్య వైద్య విద్యలో ఏఐ, వృత్తిపరమైన గుర్తింపు గురించి నిపుణులు చర్చించారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్‌ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఉమా శేఖర్‌, ప్రో వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ మహేష్‌ వాకముడి, మెడికల్‌ కాలేజీ డీన్‌ డాక్టర్‌ కె. బాలాజీ సింగ్‌, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌. సెంథిల్‌ కుమార్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అకడమిక్‌ కన్వీనర్‌ డాక్టర్‌ ఎం. శాంతి, ఇతర అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement