తమిళసినిమా: నటుడు చేతన్ సీను చాలా గ్యాప్ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం వళ్లువన్.నటి ఆషా జవేరి నాయకిగా నటించిన ఈ చిత్రంలో నటుడు సాయిదీనా, ప్రేమ్ కుమార్, కరాటే రాజా. తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. షైలేకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను శంకర్ సారథి నిర్వహించారు. లవ్, క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రంలో హీరో ఫుడ్ డెలివరీ యువకుడిగానూ, హీరోయిన్ వృద్ధులకు సేవలందించే యువతి గానూ నటించారు. అయితే వీరి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? ఎక్కడ పరిచయం జరిగింది అనే అంశాలతో పాటూ ఓ ప్రముఖ రాజకీయవేత్త, పోలీస్ అధికారి, న్యాయవాది ఎలా? ఎందుకు హత్యకు గురయ్యారు? పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం వళ్లువన్. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న మానభంగాలు, మధాందుల అరాచకాలను తెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా చిత్రం బాగుందని, చూసిన వారు చెబుతున్నారనీ, విడుదలైన థియేటర్లో ప్రేక్షకులు చూడటానికి వస్తున్నారని నటుడు చేతన్ సీను పేర్కొన్నారు. అయితే తమ చిత్రానికి సరిగా థియేటర్లు లభించలేదని, కొన్ని థియేటర్లలో ఉదయం ఆటలు మాత్రమే ప్రదర్శిస్తున్నారని వాపోయారు. వ్యయ ప్రాయాసాలకోర్చి చిత్రాన్ని రూపొందించామన్నారు.


