క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

అధికారులు సరదా కోసం వస్తారు

సీఎం రంగస్వామి సంచలన వ్యాఖ్యలు!

సాక్షి,చైన్నె : పుదుచ్చేరి పరిపాలనలో ఐఏఎస్‌ అధికారుల తీరుపై సీఎం రంగస్వామి అసహనం, ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ అధికారులు కేవలం వినోదం, సరదా కోసమే పుదుచ్చేరికి వస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. టీవీకే పుదుచ్చేరి ఎమ్మెల్యే సాయి జే శరవణకుమార్‌ సీఎం రంగస్వామిని కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనాన్ని పూర్తిస్థాయిలో అందించడం లేదని ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే శరవణ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 3,970 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి కేవలం ఏడుగురు ఐఏఎస్‌ అధికారులు ఉంటే, కేవలం 492 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న పుదుచ్చేరిలో 20 మందికి పైగా ఐఏఎస్‌ అధికారులు ఉన్నారన్నారు. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ పనులు చాలా ఆలస్యంగా సాగుతున్నాయి. ఇక్కడి ప్రధాన కార్యదర్శికి తమిళం రాదని, సీఎంకు హిందీ రాదని వ్యాఖ్యలు చేశారు. ఇకపై సీఎం అధికారులను కలిసేటప్పుడు పలు భాషలు తెలిసిన వ్యక్తిగత కార్యదర్శిని వెంట ఉంచుకోవాలని సూచించారు. ఈ విషయంపై సీఎం రంగస్వామి స్పందిస్తూ.. పుదుచ్చేరి పరిపాలన తమిళనాడు, కేరళ, కర్ణాటకల కంటే భిన్నంగా ఉంటుందని, ఇక్కడ ప్రతి ఫైల్‌ను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు పంపాల్సి రావడం వల్లే ఆలస్యమవుతోందని వివరించారు. అయితే, అనేక మంది అధికారులు ఇక్కడకు సరదా కోసం లేదా కాలక్షేపం కోసం వస్తున్నట్టుందని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది.

24, 25 తేదీల్లో జమాబందీ

కొరుక్కుపేట: చైన్నె జిల్లాలో షోలింగనల్లూరు, మధురవాయిల్‌, అంబత్తూరు, తిరువొట్రియూర్‌, అలందూరు, మాధవరం తాలూకాలకు సంబంధించిన రెవెన్యూ జమాబందీ 24, 25 తేదీల్లో జరగనుంది. పట్టాదారులు తమ పట్టా , ఇతర సమస్యలకు సంబంధించి వినతిపత్రాలు సమర్పించి, సమస్యలు పరిష్కరించుకోవాలని చైన్నె జిల్లా కలెక్టర్‌ ఎస్‌. మాలతిహెలెన్‌ తెలిపారు. జమాబందీ జూన్‌ 24, 25 తేదీల్లో ఉదయం 9గంటలకు ఆయా రెవెన్యూ తాలూకా కార్యాలయాల్లో జరగనుంది. జమాబందీ సమావేశాల్లో రెవెన్యూ సెటిల్మెంట్‌ అధికారుల ఎదుట ప్రజలు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆమేరకు షోలింగనల్లూరులో జిల్లా కలెక్టర్‌ ఎదుట, మధురవాయల్‌ తాలూకాలో చైన్నె జిల్లా రెవెన్యూ అధికారి ఎదుట సెటిల్మెంట్‌ సమావేశం జరుగుతుంది. సంబంధిత గ్రామాలకు చెందిన భూమి హక్కుదారులు తమ సంబంధిత పత్రాలతో కార్యాలయాలకు వ్యక్తిగతంగా హాజరై, తమ వినతిపత్రాలను సమర్పించి తమ హక్కు పత్రాలను పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు.

బస్సు నుంచి పడి మహిళ మృతి

సాక్షి, చైన్నె : తమిళనాడులోని కరూర్‌ జిల్లా కుళితలై సమీపంలో ఒక ప్రైవేట్‌ బస్సు అతివేగంగా మలుపు తిరుగుతున్న సమయంలో, బస్సులో నుంచి కిందపడి ఓ మహిళా ప్రయాణికురాలు మృతిచెందింది. కరూర్‌ జిల్లా కుళితలై సమీపంలోని కె.పేట్టై పంచాయతీ, తిమ్మాచ్చిపురం గ్రామానికి చెందిన మాలతి (45). తిరుచ్చి జిల్లా తొట్టియం ప్రాంతంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం ఆమె తిరిగి తన స్వగ్రామానికి వస్తూ కుళితలై టోల్‌గేట్‌లో మాయనూర్‌ వెళ్లే ఒక ప్రైవేట్‌ బస్సు ఎక్కింది. బస్సు కరూర్‌ – తిరుచ్చి జాతీయ బైపాస్‌ రోడ్డులోకి ప్రవేశించే క్రమంలో, మేలకురప్పాలయం మలుపు వద్ద డ్రైవర్‌ బస్సును అత్యంత వేగంగా తిప్పాడు. ఆ సమయంలో బస్సు ఫుట్‌బోర్డ్‌ వద్ద నిలబడి ఉన్న మాలతి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె మృతిచెందింది. ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి దారుణ హత్య

అన్నానగర్‌: నైల్లె సమీపంలో మాజీ పంచాయతీ అధ్యక్షుడి సోదరుడిని సోమవారం అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హంతకులను పట్టుకోవడానికి 8 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. నైల్లె జిల్లా మేలకల్లూరులోని అగ్రహారం వీధి నివాసి షణ్ముగవేల్‌ (55) కట్టెల వ్యాపారి. ఇతని భార్య పరమేశ్వరి. దంపతులకు ముత్తు అనే కుమారుడు, అన్నలక్ష్మి అనే కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ కోయంబత్తూరులో నివసిస్తున్నారు. షణ్ముగవేల్‌, ఇతని స్నేహితులు మేలకల్లూరులోని సప్పాణి కంఠస్వామి ఆలయం ముందు సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో, రెండు బైకులపై హెల్మెట్లు ధరించిన ఆరుగురు వ్యక్తుల ముఠా ఒక్కసారిగా షణ్ముగవేల్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆగ్రహించిన ఆ ముఠా, షణ్ముగవేల్‌ను కత్తులతో నరికి పారిపోయింది. అనంతరం, షణ్ముగవేల్‌ బంధువులు అతడిని రక్షించి నైల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యంలో, షణ్ముగవేల్‌ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హత్య జరిగిన ప్రదేశంతో సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వారు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని సమీక్షించి హంతకుల కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితులను అరెస్టు చేయడానికి 8 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశారు. హత్యకు గురైన షణ్ముగవేల్‌ సోదరుడు మారియప్పన్‌ (48), మేలకల్లూరు పంచాయతీ మండలి మాజీ అధ్యక్షుడు కావడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement