కొరుక్కుపేట: పోలీసు శాఖలో ప్రతిభ కనబరిచిన 300 మంది పోలీసు అధికారులకు సీఎం పతకాలను ప్రదానం చేశారు. శనివారం జరిగిన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ అమల్ రాజ్ చేతుల మీదుగా వాటిని పోలీసు అధికారులను అందజేసి ప్రశంసించారు. వీరిలో చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్ లా అండ్ ఆర్డర్ డివిజన్‌కు చెందిన 157 మంది పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, సాయుధ దళాలు , మోటార్ వెహికల్స్ డివిజన్, ఇంటెలిజెన్స్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, చైన్నెలోని మోడరన్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చెందిన 94 మంది పోలీసు అధికారులు ఉన్నారు. చైన్నె మెట్రోపాలిటన్ పోలీస్‌లో పనిచేస్తున్న 300 మంది పురుష, మహిళా పోలీసు అధికారులకు సీఎం పతకాల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం జరిగింది. వీరిలో సెక్యూరిటీ పోలీస్ యూనిట్, హైకోర్టు సెక్యూరిటీ పోలీస్ యూనిట్, క్రిమినల్ రికార్డ్స్ బ్యూరో, ప్రివెన్షన్ యూనిట్ వంటి ప్రత్యేక విభాగాలలో పనిచేస్తున్న 49 మంది పోలీసు అధికారులు కూడా ఉన్నారు.
వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
సాక్షి, చైన్నె : తమిళనాడులో వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెడతామని, కావేరి జలాలలను త్వరలోనే సాగు నిమిత్తం విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ తెలిపారు. కుంభకోణం పరిధిలోని కోవిలాచ్చేరి, మిళలై ప్రాంతాలలో సి, డి విభాగం కాలువల పూడికతీత పనులను వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ శనివారం ప్రారంభించారు. వ్యవసాయ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కోవిలాచ్చేరి మిళలైలో 6.9 కి.మీ., కల్లూర్‌లో 14.6 కి.మీ., తిరునల్లూర్‌లో 2.6 కి.మీ., నీరత్తనల్లూర్‌లో 2.5 కి.మీ చొప్పున మొత్తం 26.65 కి.మీ పొడవునా రూ.9.25 లక్షల అంచనా వ్యయంతో ఈ పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మంత్రి వినోద్ మీడియాతో మాట్లాడారు. జూన్ 12వ తేదీన మేట్టూరు డ్యాం నుంచి కావేరి జలాలలను సాగు నిమిత్తం విడుదల చేస్తారా? అని ప్రశ్నించగా, ముందస్తుగానే కావేరి నీటిని త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి విడిగా ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం, అరసలాటి నదిలో 3వ విడతగా 4.30 కి.మీ పొడవునా జరుగుతున్న పూడికతీత పనులను కూడా మంత్రి వినోద్ స్వయంగా పరిశీలించి ప్రారంభించారు.
మీడియాను సీఎం
కలవాల్సిన అవసరం లేదు
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదని మంత్రి నిర్మల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మదురైలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుప్పర కుండ్రం దీపం వ్యవహారంలో ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో రెండేళ్ల క్రితం ఎలాంటి పరిస్థితి ఉందో, అదే పరిస్థితి ఇప్పుడూ కొనసాగాలన్నదే ప్రభుత్వ విధానంగా వ్యాఖ్యలు చేశారు. మత శక్తులు ఇక్కడ రాజకీయం చేయడానికి తాము నూటికి నూరు శాతం అనుమతించమన్నారు. తాము ఇక్కడ రాజకీయాలు చేయడానికి లేమని, ప్రజా సేవలోనే ఉన్నామని స్పష్టంచేశారు.
మీడియా విధానం
సీఎం విజయ్ మీడియాను కలిసే విధానంపై మంత్రి నిర్మల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మీడియాను కలవడానికి నిర్దిష్టమైన, రోజువారీ పద్ధతి ఏమీ లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న పాలకులు తమ సొంత ప్రచారం కోసం, ఉనికిని చాటుకోవడానికి రోజూ మీడియా ముందుకు వచ్చేవారన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తోందని, మంత్రులు రోజూ ప్రజలను కలుస్తున్నారన్నారు. విద్యుత్ బోర్డులో హార్డ్ డిస్క్‌ల మయం విషయంగా డీఎంకే నేత సెంథిల్ బాలాజీ స్పందించడం ఏమిటో? అని విమర్శించారు. ఈ విషయాలతో సెంథిల్ బాలాజీకి ఉన్న సంబంధం ఏంటి? ఆయన ఎందుకు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు? విచారణ తర్వాత అన్ని విషయాలూ బయటకు వస్తాయని స్పష్టం చేశారు.


