సాక్షి, చైన్నె: ‘‘మన కూటమిలో ఉన్న పార్టీల దయాదాక్షిణ్యాల వల్లే తమిళనాడులో తాజాగా తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం నడుస్తోంది’’ అని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. చైన్నెలోని డీఎంకే ప్రదాన కార్యాలయం అన్నా అరివాలయం జరిగిన రాజకీయ కార్యక్రమంలో.. చెంగల్పట్టు అసెంబ్లీ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, కాటాంకొళత్తూర్ నార్త్ యూనియన్ సెక్రటరీ గజేంద్రన్ నేతృత్వంలో ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు డిఎంకెలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సాధారణంగా ఒక పార్టీని వీడి మరో పార్టీలోకి వెళ్లేటప్పుడు.. ఏదో ఒక లాభాన్ని, సదుపాయాలను ఆశించి అధికార పార్టీ వైపు వెళ్తుంటారన్నారు. అయితే తాజాగా డీఎంకే అధికారంలో లేదని, . అధికార పీఠం కోల్పోయి ప్రతిపక్ష స్థానంలో ఉందన్నారు. ఈ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలోకి వచ్చారంటే పదవుల కోసం కాకుండా , ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, తమిళ సమాజం కోసం పని చేయాలనే పట్టుదలతో రావడం ఆనందంగా ఉందన్నారు.
ఓటమితో కుంగిపోం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అవి మారుతూ ఉంటాయన్నారు.. గెలిచినప్పుడు విరవ్రీగడం, ఓడినప్పుడు కుంగిపోవడం డీఎంకే డిక్షనరీలోనే లేదున్నారు. అధికారం కోల్పోయినా సరే.. ప్రతిపక్ష హోదాలో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేవాడే నిజమైన డీఎంకే కార్యకర్త అని ధీమా వ్యక్తం చేశారు.
మన అనుమతితోనే వారు వెళ్లారు..
రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నదే మన దయ వల్ల అనే విషయాన్ని ఎవ్వరూ మరచిపోకూడదన్నారు. డీఎంకే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగామన్నారు. అయితే, కూటమిలో ఉండి, ప్రస్తుతం టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆయా పార్టీల నేతలే స్వయంగా ఒక విషయం చెప్పారన్నారు. తాము వెళ్లేటప్పుడు డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్‌కు చెప్పే వచ్చామని వారు బహిరంగంగానే పేర్కొనడాన్ని గమనించాలన్నారు. ఆ పార్టీల నేతలు తనను కలిసి వారి నిర్ణయాన్ని చెప్పినప్పుడు.. తాను మీ ఇష్టం, అది మీ ప్రజాస్వామ్య హక్కు, నేను అడ్డుకోను.. అని చెప్పి పంపానని వివరించారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన రాకూడదు, దాని ద్వారా బీజేపీ ఇక్కడ అధికారం చలాయించకూడదనే ఉద్దేశంతోనే తాను వారిని పంపానని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా, మన దయతో నడుస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే ముగింపు పలకాలని ఈ వేదికగా శపథం చేద్దామని పిలుపు నిచ్చారు.


