కమీషన్‌ల విధానాన్ని అరికట్టాలి
తమిళసినిమా: రివ్జిన్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నవ నిర్మాత లెనిన్ నిర్మించి, కథానాయకుడిగా నటించిన చిత్రం రెడ్ లేబుల్. నటి అశ్విన్ నాయకిగా నటించిన ఇందులో దర్శకుడు ఆర్వీ, ఉదయకుమార్ ప్రధాన పాత్ర పోషించారు. నటుడు మునీష్ కాంత్ గౌరవ పాత్రలో నటించిన ఈ చిత్రంలో దర్శక దర్శకుడు అనుమోహన్, తరుణ్, కెవిన్, కార్ మేఘం శశి,అనూష తదితరులు ముఖ్యపాత్రులు పోషించారు. పొన్ పార్తీపన్ కథను అందించిన ఈ చిత్రానికి కేఆర్ వినోద్ దర్శకత్వం వహించారు. సతీష్ మెయ్యప్పన్ ఛాయాగ్రహణం, కై లాష్ మీనన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 6వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను కథానాయకుడు, నిర్మాత లెనిన్ తెలుపుతూ ఇది యాక్షన్ థ్రిల్లర్‌లో రూపొందిన కథా చిత్రం అని చెప్పారు. ఈ చిత్రానికి ముందు కథను తయారు చేసి ఆ తర్వాత దర్శకుడు , నటీనటులు, సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసినట్లు చెప్పారు. చాలా అవరోధాలను ఎదుర్కొని చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. ఫెఫ్సీ కారణంగా ప్రారంభమైన ఆరు రోజుల్లోనే షూటింగ్లో నిలిపేసి మళ్లీ ఆ సమస్యను పరిష్కరించి నిర్వహించినట్లు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కమీషన్ల విధానం ఎక్కువగా ఉందన్నారు. తాను చిత్ర షూటింగ్ కోసం నాలుగు షెడ్యూళ్లలో నాలుగు యూనిట్లను మార్చానని చెప్పారు. మొదటి యూనిట్‌కు లక్ష రూపాయలు, ఆ తర్వాత యూనిట్‌కు రూ. 90 వేలు, ఆ తర్వాత యూనిట్‌కు రూ. 80 వేలు, చివరి షెడ్యూల్ కు రూ.70 వేలు చెల్లించానని చెప్పారు. ఇలా సుమారు రూ.5 కోట్ల బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తే అందులో 25 శాతం కమీషన్లకే పోతుందన్నారు. మనం పారితోషికాలు, జీతాలు చెల్లించి ఆ తర్వాత కమిషన్ కూడా ఎందుకు చెల్లించాలి అని ప్రశ్నించారు. అదేవిధంగా చిత్రంలో ఒక ముఖ్య పాత్ర కోసం ఒక సీనియర్ నటుడిని సంప్రదిస్తే అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేశారన్నారు. అయితే అది ఆయన హక్కు కాబట్టి ఏమి మాట్లాడకూడదని, కానీ ఆయన షూటింగ్ ట్రావెలింగ్ కోసం కిలోమీటర్‌కు రూ. 25 చొప్పున ఇవ్వాలని అడిగారన్నారు. ఈ విధానాన్ని తాను ఎక్కడ చూడలేదని వాపోయారు. కాగా తమ చిత్రంపై నమ్మకంతో డ్రీమ్ వారియర్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేస్తుందని లెనిన్ చెప్పారు.


