క్లుప్తంగా
వేలూరు: కాంగ్రెస్ ప్రభుత్వంలో దేశ వ్యాప్తంగా వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేలూరు అన్నారోడ్డులో నిరాహార దీక్ష చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవేశ పెట్టిన పథకాలను తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, దేశ వ్యాప్తంగా కార్మికులు, కూలీలు, ఉద్యోగులు మార్పు కోరుకుంటున్నారని త్వరలోనే తగిన గుణపాఠం చెపుతారన్నారు. నిరాహార దీక్షలో ఆ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు వాహీద్‌బాషా, ఎస్‌సీఎస్‌టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్తరంజన్, డివిజన్ కార్యదర్శులు కప్పల్ మణి, మహ్మద్‌ఆలీ జిన్నా, రఘు, కాట్పాడి గుణ, వసంతప్రియ, వరదరాజన్ పాల్గొన్నారు.
కొరుక్కుపేట: చైన్నె కార్పొరేషన్ మనాలి కామరాజ్ రోడ్డులో ఉన్న సరస్సుకు ఇరువైపులా పునరుద్ధరణ పనులు చేపట్టారు. సరస్సు చుట్టూ రోడ్లు నిర్మించి పార్కులను అభివృద్ధి పరిచారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక పడవ రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మనాలి మర్చంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మారిముత్తు మాట్లాడుతూ, చైన్నె కార్పొరేషన్ ఇప్పుడు మనాలి ప్రాంత ప్రజల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చింద న్నారు. ఈ పడవ పర్యాటకం మనాలి ప్రాంతంలో వ్యాపారాన్ని పెంచుతుందని, రోజూ వేలాది మంది పర్యాటకం కోసం వస్తారని అట్టడుగు స్థాయి వ్యాపారుల జీవితాలు సుసంపన్నం అవుతాయని అభిప్రాయపడ్డారు. మనాలి ప్రాంత ప్రజలను గర్వపడేలా చేసిన ముఖ్యమంత్రి, తమిళనాడు మర్చంట్స్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఏ ఎం. విక్రమరాజా మనాలి సెక్కడు వ్యాపారుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
వేలూరు: బైకు మెకానికల్‌కు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు ఇప్పించి ఇన్సురెన్స్ సదుపాయం కల్పించాలని వేలూరు సిటీ బైకు మెకానికల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధరన్ అన్నారు. ఆ సంఘం పదవ వార్షికోత్సవం, నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైకు మెకానికల్‌ను సంఘంలో సభ్యులుగా చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇప్పటికే సంఘం నూతన భవనాన్ని నిర్మించి ప్రారంభించడం జరిగిందని జిల్లాలోని కార్మికులందరికీ ప్రతి సంవత్సరం పలు సంక్షేమ పథకాలను సంఘం ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు చెక్కులతో పాటు సభ్యులకు సంక్రాంతి కానుకలు, సంక్షేమ పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి సెందామరై, జాయింట్ కార్యదర్శి విజయకుమార్, కోశాధికారి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షులు వేలు, విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గోపీనాథ్‌లతో పాటూ కార్యనిర్వహక కమిటీ సభ్యులు, బైకు విడి భాగాల విక్రయ కేంద్రం యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: చైన్నె విమానాశ్రయం పరిసర ప్రాంతాలైన మీనంబాక్కం, కౌల్ బజార్, పొళిచలూర్, పమ్మల్, అనకాపుత్తూర్, తరపాక్కం, మణపాక్కం, నందబాక్కం సహా వివిధ నివాస ప్రాంతాలలో భోగి పండుగ రోజు ఉదయం వేళల్లో పాత టైర్లు, ప్లాస్టిక్ వంటి వివిధ వ్యర్థాలను కాల్చివేస్తున్నారు. దీని కారణంగా విమానాశ్రయం రన్‌వే కనపడనంతగా దట్టమైన నల్లటి పొగతో పాటు తీవ్రమైన పొగమంచు కమ్ముకుంటుంది. ఈ నేపథ్యంలో, ఈ సంవత్సరం వచ్చే 14వ తేదీన భోగి పండుగను పురస్కరించుకుని, చైన్నె విమానాశ్రయం పరిసర ప్రాంతాల ప్రజలకు భారత విమానాశ్రయ అథారిటీ విజ్ఞప్తి చేస్తూ, వాటిని అవగాహన కరపత్రాల ద్వారా, స్థానిక సంస్థల ప్రచారం ద్వారా నొక్కి చెబుతోంది. దాని ప్రకారం, భోగి పండుగ సమయంలో ఉదయం వేళల్లో విమానాశ్రయం పరిసర ప్రాంతాలలో నివసించే సామాన్య ప్రజలు పాత టైర్లు, ప్లాస్టిక్ వంటి వివిధ వ్యర్థాలను వీధులు, రోడ్లపై వేసి కాల్చడం మానుకోవాలని, తద్వారా విమాన సేవలకు అంతరాయం కలగకుండా ప్రజలు సహకరించాలని భారత విమానాశ్రయ అథారిటీ సూచించింది.
క్లుప్తంగా


