పిల్లలు లేరని మహిళ ఆత్మహత్య
తిరువళ్లూరు: వివాహమై 13 సంవత్సరాలు దాటినా పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన మహిళ ట్యాంకర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలూకా దేవందవాక్కం గ్రామానికి చెందిన పెరుమాళ్ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన జూడిజగదాంబాల్‌కు 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే ఇంత వరకు పిల్లలు లేరు. దీంతో చాలా కాలం నుంచి మనోవేదనకు గురైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెరుమాళ్ పనులకు వెళ్లిపోగా, జూడిజగదాంబాల్ ఇంటి వద్దే ఉంది. మద్యాహ్నం రెండు గంటల సమయంలో పెరుమాళ్ పలుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానంతో ఇంటికి రాగా తాళం వేసి ఉండడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే వెనుక వైపు వెళ్లిచూడగా నీటి ట్యాంకర్‌లో శవమై కనిపించింది. వెంటనే పెరుమాళ్ స్థానికులకు, పెనాలూరు పేట పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం వైద్యశాలకు తరలించారు. కాగా జూడి జగదాంబాల్‌ది ఆత్మహత్య లేదా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పెనాలూరుపేట పోలీసులు దర్యాప్తును చేపట్టారు.


