అది దీప స్తంభం కాదు!
సాక్షి, చైన్నె : తిరుప్పరకుండ్రం కొండపై ఉన్న రాతి స్తూపం దీప స్తంభం కాదని ఆలయ నిర్వాహక కమిటీ ద్విసభ్య బెంచ్‌కు వివరించింది. మొదటి నుంచి ఈ వ్యవహారంలో అందరి తరఫు వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ జడ్జి ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. తిరుప్పరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింపు వ్యవహారం రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఇక్కడి కొండపై ఉన్న స్తూపంలో దీపం వెలిగించాలంటూ దాఖలైన పిటిషన్ వ్యవహారంలో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ఇచ్చిన ఉత్తర్వులు వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. ఈ పరిస్థితులలో జీఆర్ స్వామినాథన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రభుత్వం, తిరుప్పరకుండ్రం ఆలయ కార్యవర్గం దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ విచారణ శుక్రవారం ప్రారంభమైంది. మధురై హైకోర్టులో ద్విసభ్య బెంచ్ ముందు వాడివేడిగా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పీఎస్ రామన్ హాజరై తొలుత వాదనలు వినిపించారు. అలాగే, ఆలయ నిర్వాహక కమిటీ తరఫున సైతం సమగ్ర వివరాలతో వాదనలు జరిగాయి.
ఆధారాలు లేవు
175 సంవత్సరాలుగా ఎలాంటి ఆధారం తమకు దొరకలేదని వివరించారు. కొండపై ఉన్నది దీప స్తంభం కాదని, అది సర్వే రాయిగా పేర్కొన్నట్టు సూచించారు. దర్గా, ఉచ్చిపిళ్లయార్ ఆలయాలకు మధ్యలో ఈ స్తూపం ఉందని పేర్కొంటూ, ఆలయ ఆగమ శాస్త్రం ప్రకారం ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్దే దీపం వెలిగించడం జరుగుతున్నదన్నారు. దశాబ్దాల తరబడి అక్కడి ప్రజలంతా అన్నదమ్ముళ్ల వలే మెలుగుతున్నారని, అయితే, బయటి వ్యక్తుల రూపంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులతో నెలకొన్నట్టు వివరించారు. ఆలయ ఆగమ శాస్త్రపరంగా ఉన్న నిబంధనలు ఎలా మార్చగలమని ప్రశ్నించారు. అందరి వాదనలు వినాలని పదేపదే విన్నవించినా, సింగిల్ బెంచ్ జడ్జి మాత్రం ఏకపక్షంగానే వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. మొదటి నుంచి ఆయన ఏక పక్షంగా వ్యవహరిస్తూ, దీపం వెలిగించాల్సిందేనని హుకుం జారీ చేశారేగానీ, గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, ఇతరుల వాదనను ఆయన వినే పరిస్థితులలో లేదని పేర్కొంటూ, ఆయన ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తాజాగా ఉత్తర్వులు ఇచ్చిన మేరకు ఆ స్థూపం వద్ద వెలిగిస్తే, అది అందరికీ కనిపించదని, ఉచ్చి పిళ్లయార్ ఆలయం వద్ద వెలిగిస్తే యావత్ తిరుప్పరకుండ్రం అంతా దీపం కనిపిస్తుందని వివరించారు. తర్వాత పిటిషనర్ తరఫున వాదనలు జరగనున్నాయి.


