● 6న అఖిల పక్షం భేటీ ● రాజకీయ పక్షాలకు ప్రభుత్వం ఆహ్వాన
సాక్షి, చైన్నె: రాజకీయ పక్షాల రోడ్ షోలు, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనకు కసరత్తు వేగవంతం చేశారు. దీని గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈనెల 6న అఖిల పక్ష సమావేశానికి పిలుపు నిచ్చారు. వివరాలు.. 2026 ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమైన విషయం తెలిసిందే. తమ బలాన్ని చాటుకునే రీతిలో, ప్రజల్ని ఆకర్షించే విధంగా దూసుకెళ్తూ వచ్చాయి. అయితే గత నెల 27వ తేదీన కరూర్‌వేదికగా తమిళగ వెట్రి కళగం నేత విజయ్ నిర్వహించిన ప్రచారం పెను విషాదానికి దారి తీసింది. రాష్ట్ర చరిత్రలోనే ప్రపథమంగా జరిగిన ఈ ఘోర ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. దేశాన్నే ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటన తదుపరి ఎక్కడిక్కడ ప్రచార సభలు, రోడ్ షోలకు బ్రేక్ పడింది. ఈ ఘటన బాధితులకు తమిళనాడు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియాను అందజేసింది. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి మార్గదర్శకాలు రూపకల్పనకు చర్యలు చేపట్టింది. మద్రాస్ హైకోర్టు ఇటీవల నిర్దేశించిన నియమాలను అనుసరించే విధంగా తమిళనాడులో బహిరంగ సమావేశాలు , ర్యాలీలు తదితర కార్యక్రమాల నిర్వహణకు మార్గదర్శకాలను రూపొందించడం గురించి ఇప్పటికే సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ అధికారులతో పలుమార్లు చర్చించారు. కొన్ని కీలక అంశాలను పరిగణించి, అందుకు అనుగుణంగా ఆంక్షలతో కూడిన మార్గదర్శకాల రూపకల్పన పై దృష్టి పెట్టారు.
సూచనల కోసం..
ఈ మార్గదర్శకాల రూపకల్పన గురించి అందరి అభిప్రాయాలు , సూచనలు, సలహాలను స్వీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కమిషన్ గుర్తింపు పొందిన పార్టీలు , ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిగిన పార్టీల ప్రతినిధులతో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈనెల 6న ఉదయం 10.30 గంటలకు చైన్నెలో ఈ సమావేశం జరగనుంది. సచివాలయంలోని నామక్కల్ కవింజ్ఞర్ మాళిగైలోని పదో అంతస్తు ఆడిటోరియంలో జరగనన్న ఈ సమావేశానికి హాజరు కావాలని గుర్తింపు పొందిన పార్టీలకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి మురుగానందం సోమవారం ఆహ్వానాలు పంపించారు. సీనియర్ మంత్రుల నాయకత్వంలో జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలు తప్పకుండా హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ఇదిలా ఉండగా కరూర్ ఘటనను విచారిస్తున్న సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. 306 మందిని విచారించేందుకు సమన్లు జారీ చేశారు. అలాగే, సీబీఐ – తమిళనాడు ప్రభుత్వానికి మధ్య విచారణ పరంగా సమన్వయ అధికారిగా రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ధీరజ్‌కుమార్‌ను నియమించారు.


