తిరువలంగాడు– అరక్కోణం నాలుగు లేన్ల రోడ్డు ప్రారంభం
తిరుత్తణి: తిరువళ్లూరు– అరక్కోణం మార్గంలో రవాణా సేవలు విస్తరించేందుకు వీలుగా ముఖ్యమంత్రి రోడ్ల అభివృద్ధి నిధుల నుంచి రూ. 82 కోట్లు కేటాయించారు. దీంతో రెండు లైన్ల రోడ్డును తిరువలంగాడు నుంచి అరక్కోణం మున్సిపాలిటీ హద్దు వరకు 9 కి.మీ దూరం విస్తరించి నాలుగు లైన్ల రోడ్డు పనులు ఏడాదిగా నిర్వహించారు. తిరుత్తణి హైవే శాఖ ద్వారా నిర్వహించిన పనుల్లో భాగంగా రోడ్డుకు మధ్యలో 21 ప్రాంతాల్లో కల్వర్టులు సైతం నిర్మించి రోడ్డును విస్తరించారు. రోడ్డుకు ఇరువైపుల వెయ్యి మొక్కలు నాటి పర్యవేక్షిస్తున్నారు. విస్తరించిన కొత్త రోడ్డు ద్వారా అరక్కోణం, తిరువళ్లూరు, చైన్నె, కంచి, రాణిపేట,వేలూరు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటూ ప్రమాదాలు తగ్గి గూడ్సు లారీలు, కర్మాగారాలకు వెళ్లు వాహనాల సమయం వృథా కాకుండా సకాలంలో రాకపోకలు సాగించేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై గ్రామీణులు, ప్రయాణికులు, వాహన చోదకులు హర్షం వ్యక్తం చేశారు.


