క్లుప్తంగా
వేలూరు: రక్తదానం చేసి ప్రాణపాయ స్థితిలో ఉన్న వారికి ప్రాణం. కలర్స్ వస్త్ర దుకాణం అధినేత ప్రవీన్ అన్నారు. విల్లుపురం మహాలక్ష్మి గ్రూప్స్ అధినేత కేజీ రమేష్ గుప్తా నాల్గవ వర్థింతి దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని కలర్స్ వస్త్ర దుకాణంలో వేలూరు మెడికల్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి, కలర్స్ వస్త్ర దుకాణం సంయుక్తంగా ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో అధిక సంఖ్యలో కార్మికులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు.
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలోని కోవిల్‌పట్టి సమీపంలో సాత్తూరు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాల వ్యాన్ సోమవారం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లడానికి నాలాట్టిన్ పుత్తూరు ప్రాంతానికి వెళ్తోంది. డ్రైవర్ కరుప్పాస్వామి వ్యాన్‌ను నడుపుతున్నాడు. నైల్లె–మదురై జాతీయ రహదారిపై వెళ్తున్న సమయంలో స్కూల్ వ్యాన్‌ను ఓ కారు అకస్మాత్తుగా రోడ్డు దాటి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వల్లీయూరుకు చెందిన షేక్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు నడుపుతున్న అగస్టిన్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ కరుప్పాస్వామి, వ్యాన్‌లో ఉన్న సహాయకురాలు అయ్యమ్మాళ్, 10వ తరగతి, 2వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలతో సహా మొత్తం ఐదుగురు గాయపడ్డారు.
సాక్షి, చైన్నె: తమ విజయగాథలతో రైతులకు నిరంతర మద్దతును ఇస్తూనే ఉంటామని ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు. ఆవిష్కరణ, రైతు కేంద్రీకృత,క్రాస్ పంక్షనల్ సహకారంపై దృష్టి పెట్టే విధంగా చేపట్టిన కార్యక్రమం గురించి స్థానికంగా సోమవారం ఆయన ప్రకటించారు. అక్టోబరు 25 ట్రాక్టర్లపై జీఎస్‌టీ తగ్గింపు తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ అమ్మకాలు 27,028గా నమోదై కొత్త రికార్డును నమోదు చేసిందని వివరించారు. ఈ అద్భుత ప్రయాణం కొత్త అధ్యాయాన్ని లఖించిందన్నారు. ట్రాక్టర్ల పరిశ్రమలో తిరుగులేని శక్తిని నిర్వచిస్తూ, ఓ ఏకీకృత బృందంగా కలిసి నిలబడి అందించే ప్రతి హెవీ డ్యూటీ ట్రాక్టర్ సాధికారతకు చిహ్నంగా సూచిస్తున్నామన్నారు. ఈ విజయగాథలతో రైతులకు మరంత మద్దతు ఇచ్చే విధంగా దూసుకెళ్లనున్నామని వివరించారు.
సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో కొత్తమైలురాయిని చేధించినట్టు జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటారు ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రెత్రా తెలిపారు. దేశంలో 4 డబ్ల్యూ – ఈవీ వృద్ధిలో కీలక పాత్ర గురించి స్థానికంగా సోమవారం ప్రకటించారు. ఈవీ పోర్ట్ పోలియో బలమైన పనీతీరుతో ముందుకెళ్తోందన్నారు. ఆటో – టెక్ కంపెనీ స్థిరమైన భవిష్యత్తు కోసం, ఇంటెలిజెంట్ మొబిలిటీ సొల్యూషన్‌లను రూపొందించడంలో ముందజంలో ఉందని వివరించారు. స్మార్ట్ ఉత్పత్తులను మాత్రమే కాకుండా సహజమైన పర్యావరణ వ్యవస్థ ఆధారిత పరిష్కారాలు కూడా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశంలో 1,00,000 ఈవీ అమ్మకాల మైలురాయిని తాము ఛేదించామని ఈసందర్భంగా ప్రకటించారు.
తిరుత్తణి: ఆంధ్రా నుంచి షోళింగర్‌కు బైకులో మద్యం తరలించిన ఇద్దరిని పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. తమిళనాడుకు సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతాల్లోని ప్రయివేటు మద్యం షాపుల నుంచి తక్కువ ధరకు విక్రయిస్తున్న మద్యం కొనుగోలు చేసి తమిళనాడు సరిహద్దు గ్రామాలు ద్వారా తరలించి విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో మద్యపాన నిషేధిత విభాగం సీఐ సురేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం ఆర్కేపేట మండలంలోని ఆంఽధ్రా సరిహద్దు ప్రాంతాల్లో నిఘావుంచారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పాలసముద్రం నుంచి తమిళనాడు గ్రామం దేవలంబాపురం వైపు వచ్చిన బైకును నిలిపి తనిఖీ చేశారు. అందులో అక్రమంగా ఆంధ్ర మద్యం 95 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తులో షోళింగర్ సోమసుందరానికి చెందిన దక్షిణామూర్తి (52), ప్రవీణ్‌కుమార్(32) ఇద్దరు ఆంధ్రాలో మధ్యం కొనుగోలు చేసి షోళింగర్‌లో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తెలిసింది.
వైభవంగా ఆలయ కుంభాభిషేకం
కొరుక్కుపేట: రామనాథపురం సంస్థానం దేవస్థానం అయిన ముత్తురామలింగ స్వామి ఆలయం మహాకుంభాభిషేకం మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. గత శనివారం విఘ్నేశ్వర పూజతో కుంభాభిషేక పూజలను చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటలకు మహా హోమం, మహా లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, బ్రహ్మ చారి పూజ, గో పూజ దీపారాధన నిర్వహించారు. పవిత్ర జలంతో గోపుర కలశాలపై పోసి కుంభాభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
క్లుప్తంగా


