విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
కొరుక్కుపేట: రాష్ట్ర జనాభాలో 40 శాతానికి పైగా ఉన్న తెలుగు కుటుంబాలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నార్త్ చైన్నె కొడింగైయూర్లోని సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం కార్యదర్శి పాతూరి లక్ష్మణ రావు ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు.
సీతారామనగర్ తెలుగు ప్రజా సంక్షేమ సంఘం 44వ వార్షిక సర్వసభ్య మండలి సమావేశం–2025 ఆదివారం ఘనంగా జరిగింది. పదవ, ప్లస్–2 పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులతో ఉత్తీర్ణులైన సంఘ సభ్యుల పిల్లలను ప్రోత్సహిస్తూ నగదు ప్రదానం, అలాగే సీనియర్ల సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. రెస్కో బ్యాంక్ విశ్రాంత జనరల్ మేనేజర్, సంఘం మాజీ అధ్యక్షులు వంజరపు శివయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను విజయవంతంగా నడిపించారు. సంఘ కార్యదర్శి పాతూరి లక్ష్మణ్ రావు సంఘాభివృద్ధికి అందించిన సేవలు అపారమని, భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గం ఏర్పాటు
ఈ సంఘంలో ప్రతి మూడేళ్లకు ఒకసారి నూతన కార్యవర్గ కమిటీను ఎన్నుకునే ప్రక్రియలో భాగంగా ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అధ్యక్ష పదవికి ఎన్నిక జరగగా, అందులో సంఘం నూతన అధ్యక్షులుగా కె. శ్రీనివాస కుమార్ ఎనికయ్యారు. మిగతా పదవులకు కొత్త వారిని ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ తీర్మానం ఆమోదించింది. ఇందులో పాతూరి లక్ష్మణ రావు (కార్యదర్శి), దానభనేని పిచ్చేశ్వరరావు (కోశాధికారి), ఆఖం దుర్గాప్రసాద్ (ఉపాధ్యక్షుడు), కొలకలేటి శ్రీనివాస్ కుమార్, బెల్లం శ్రీధర్ (సహ కార్యదర్శులు), పి.బాలాజీ, సీఎస్ జయకుమార్, జె.మధుసూధన్రావు, టి.నాగరాజు, డి.సాంబశివరావు, ఎన్.సతీష్ కుమార్, పి.సుబ్బరాజు, డి.వినోద్ కుమార్(కార్య నిర్వాహకులు)గా,ఎన్.చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యక్షులుగా ఎంపికై తమ బాధ్యతలను స్వీకరించారు.


