ప్రతి బూత్‌లో మెజారిటీ సాధించాలి
తిరువళ్లూరు: రానున్న ఎన్నికల్లో డీఎంకేకు ప్రతి పోలింగ్ బూత్‌లోనూ మెజారిటీ వచ్చేలా పనిచేయాలని డీఎంకే జిల్లా కన్వీనర్ తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ సూచించారు. తిరువళ్లూరు జిల్లా డీఎంకే పార్టీ ముఖ్యనేతలు, కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు ద్రావిడ భక్తన్, తిరుత్తణి ఎమ్మెల్యే, జిల్లా కన్వీనర్ చంద్రన్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజేంద్రన్ మాట్లాడుతూ డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత నిరుపేదలే లక్ష్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. ఎమ్మెల్యే చంద్రన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 68వేల పోలీంగ్ బూత్‌లలో డీఎంకేకు మెజారిటీ వచ్చేలా లక్ష్యాన్ని పార్టీ నిర్దేశించిందని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలన్నారు. పార్టీ నేతలు తిరుత్తణి ఎం. భూపతి, వీసీఆర్ కుమరన్, ఉధయమలర్‌పాండ్యన్, బీకే నాగరాజ్, వీఎస్ నేతాజీ, జైకృష్ణ పాల్గొన్నారు.


