మరో 38 చోట్ల హెల్త్ వాక్
సాక్షి, చైన్నె: ఉదయాన్నే వాకింగ్ చేసే వారి కోసం ప్రత్యేక మార్గం ఏర్పాట్లను ప్రభుత్వం విస్తృతం చేసింది. మరో 38 చోట్ల హెల్త్ వాక్ పేరిట ఈ మార్గాలను ఏర్పాటు చేయనున్నామని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. చైన్నెలో మెరీనా, బీసెంట్ నగర్ బీచ్‌తో పాటూ ఇతర పార్కులలతో వాకింగ్ చేసే వారు ఉదయాన్నే ఎక్కువగా ఉంటారు. ఆయా ప్రాంతాలలో వాకింగ్ చేసే వారి కోసం ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం చైన్నెలో 16 చోట్ల వాకింగ్ మార్గాలకు సిద్ధం చేశారు. ఎంకేబీ నగర్, డౌటన్, వ్యాసార్పాడి, నంగనల్లూరు, రాజా అన్నామలైపురం తదితర ప్రాంతాలో కొన్ని వీధులను ప్రత్యేకంగా వాకింగ్ కోసం మాత్రమే ఎంపిక చేశారు. ఈ వీధులలో రోడ్డుకు ఇరు వైపులా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయడమే కాకుండా, వాకర్లు కూర్చుని విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా అక్కడక్కడ ప్రత్యేకంగా కుర్చీల ఏర్పాటు, ఇతర సౌకార్యలను సైతం కల్పిస్తున్నారు. అలాగే 38 జిల్లాలోను ఈ వాకింగ్ ట్రాక్‌లపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మరో 38 చోట్ల హెల్త్ వాక్ ట్రాక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టుగా ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ శనివారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు.


