పళణి సెంగొట్టయన్
ఇద్దరి మధ్య మాటల తూటాలు ‘పళణి ఏ–1 అంటూ సెంగొట్టయన్ విమర్శ ఉద్వాసన నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్య న్యాయ పోరాటానికి సిద్ధమని వెల్లడి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయన్ మధ్య మాటల తూటాలు పేలాయి. కొంగు మండలంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతల మధ్య ఏర్పడిన వివాదం చర్చకు దారి తీసింది. ‘పళణి ఏ–1’ అంటూ పరోక్షంగా కొడనాడు హత్య, దోపిడీ కేసును ప్రస్తావిస్తూ సెంగొట్టయన్ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే నుంచి తనను తొలగించడం నిబంధనలకు విరుద్ధమని, దీనిపై న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. అయితే పార్టీ నిబంధనలకు అనుగుణంగానే సెంగొట్టయన్‌ను సాగనంపినట్టు పళణి స్వామి స్పష్టం చేశారు.
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకేలో పార్టీ ప్రధాన కార్యదర్శి పళళణిస్వామిని కొంగు మండలంలో సీనియర్ నేత, ఎమ్మెల్యే సెంగొట్టయన్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. పార్టీ బహిష్కృత నేతలు పన్నీరు, సెల్వం, టీటీవీ దినకరన్, దివంగత సీఎం జె. జయలలిత నెచ్చెలిశశికళతో ఆయన భేటీ కావడం చర్చకు దారి తీసింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగించారు. ప్రాథమిక సభ్యత్వం నుంచి సైతం తొలగిస్తూ ఇక అన్నాడీఎంకే వర్గాలు ఎవ్వరూ ఆయనతో సంప్రదింపు జరకూడదని పళణి స్వామి శుక్రవారం ఆదేశించారు. ఈ పరిస్థితులలో శనివారం ఈరోడ్‌లో సెంగొట్టయన్ ఓ వైపు, సేలంలో పళణి స్వామి మరోవైపు మీడియా ముందుకు వచ్చారు. సెంగొట్టయన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో తన ప్రయాణం గురించి గుర్తు చేశారు. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితల నుంచి తాను పొందిన మెప్పును, పార్టీకి అందించిన సేవలను వివరించారు. అయితే ప్రస్తుతం పార్టీలో ఏకాధిపత్యం సాగుతున్నట్టు ఆరోపించారు. అందరూ సమష్టిగా ముందుకెళ్దామని పిలుపు నిస్తే, పార్టీ పదవి నుంచి తప్పించారని, ఇప్పుడేమో పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. తనను పార్టీ నిబంధనలకు విరుద్ధంగా తొలగించినట్టు స్పష్టం చేశారు. అన్నాడీఎంకే నిబంధనల మేరకు తొలగింపు జరగ లేదని, ఇది చట్ట విరుద్ధం అని వ్యాఖ్యలు చేశారు. ఈ తొలగింపును వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. పళణి స్వామి కంటే అన్నాడీఎంకేలో తాను సీనియర్ అని, తనకు కనీసం ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం వేదన కలిగించిందన్నారు. అమ్మ జయలలిత మరణం తర్వాత పార్టీని నడిపించాలని చిన్నమ్మ శశికళ తనకు ఆదేశాలు ఇచ్చారని , అయితే పళణి స్వామి పేరును ప్రతిపాదించింది తానే అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని పళణి స్వామి చేపట్టినానంతరంపార్టీ కనీసం ఒక్కటంటే ఒక్క ఎన్నికలలోకూడా గెలవ లేదని, అంతా పతనమే అని ధ్వజమెత్తారు.
విలేకరులతో మాట్లాడుతున్న పళణి స్వామి
మీడియాతో మాట్లాడుతున్న సెంగొట్టయన్
V/S
నిబంధనలకు అనుగుణంగానే చర్యలు : పళణిస్వామి
సేలంలో పళణి స్వామి మీడియాతో మాట్లాడుతూ, సెంగొట్టయన్‌ను అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే తొలగించామన్నారు. సీనియర్లు అందరూ కూర్చుని చర్చించి నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పార్టీ నుంచి బహిష్కరించిన వారితో కలిసి తిరగడం, పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తే చోద్యం చూడలేమన్నారు. పార్టీ నిబంధనలు ఎవ్వరు ఉల్లంఘించినా చర్యలు తప్పదని హెచ్చరించారు. సెంగొట్టయన్ వ్యవహారంలో అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే గానీ, తాను వ్యక్తి గతంగా ఏ చర్యలు తీసుకోలేదన్నారు. కొడనాడు కేసులో అన్నాడీఎంకే హయంలో చట్ట రీత్య చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అయితే, సెంగొట్టయన్ ఇప్పడు విషం కక్కడం శోచనీయమన్నారు. నేరం జరగడంతో అందుకు సంబంధించిన సమగ్ర విచారణ జరిగిందన్నారు. అయితే రెండు మూడు హత్యలు జరిగినట్టుగా విషం చిమ్మడం మంచి పద్ధతి కాదన్నారు. ఇన్నాళ్లు మనస్సులో విషాన్ని పెట్టుకుని నాటకం ఆడుతూ వచ్చిన ఇలాంటి వాళ్లనా పార్టీలో పెట్టుకోవాలంటూ సెంగొట్టయన్ వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.మనస్సులో ఒకటి పెట్టుకుని, నాటకం ఆడుతూ వచ్చిన వారిలో ఇప్పుడు ఎలాంటి విషం అన్నది బయటకు వస్తుందో అన్న వ్యవహారంలో సెంగొట్టయన్‌ను తలదన్నే వాళ్లు మరొకరు లేరంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గానీయండి, బహిరంగ సభలలో గానీయండి డీఎంకేకు వ్యతిరేకంగా ఇంత వరకు సెంగొట్టయన్ పల్లెత్తి మాట్లాడలేదని, కనీస విమర్శలు, ఆరోపణలు కూడాచేసిన దాఖలాలు లేవు అని వివరించారు. దీనిని బట్టి ఆయన డీఎంకేకు బీ–టీంగా వ్యవహరించారన్నది అర్థం చేసుకోవాలని సూచించారు. కాగా, సెంగొట్టయన్, పన్నీరు, టీటీవీ, శశికళలు ఒకే వేదికపైకి రావడంతో వారి వైపుగా పార్టీ వర్గాలు దృష్టి పెట్టకుండా ముందు జాగ్రత్తలలో పళణి నిమగ్నమైనట్టున్నారు. ఇందులో భాగంగా ఈనెల 5వ తేదీన పార్టీ జిల్లాల కార్యదర్శుల సమావేశానికి పిలుపు నివ్వడం గమనార్హం.
ఏ–1 పళణి..
కొడనాడు కేసు గురించి ఈసందర్భంగా సెంగొట్టయన్ ప్రస్తావించారు. దివంగత అమ్మ జయలలిత జీవించి ఉన్న కాలంలో విశ్రాంతి తీసుకునే కొడనాడులో హత్య, దోపిడీ జరగడం విచారకరంగా పేర్కొంటూ, ఈ విషయంగా పళణి స్వామి ఎందుకు మౌనం వహిస్తున్నారో అని ప్రశ్నించారు. ఆయన ఈ వ్యవహారంలో గళం విప్పడం లేదంటూ, తాను డీఎంకేకు బీ టీఎం కాదు.. పళణి ఏ–1 అంటూ పరోక్షంగా కొడనాడు కేసు ప్రస్తావనను ఆయన తీసుకు రావడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మ శశికళ నుంచి పళణి స్వామి ఎలా పదవిని తీసుకున్నారో అన్నది దేశం ఎరిగిన సత్యం అని, ద్రోహం తలబెట్టడంలో ఆయనకు సరిలేరెవ్వరు అని ధ్వజమెత్తారు. ద్రోహం తలబెట్టే విభాగంలో తమిళనాడులో నోబెల్ బహుమతికి పళణి స్వామి మాత్రమే అర్హుడు అని విమర్శించారు. కాగా, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, కొడనాడు కేసు అంటే పళణికి ఎందుకు అంత భయం, ఆయన వణికి పోతున్నారని విమర్శించారు. అందరం ఏకం కాని పక్షంలో 2021లో ఎదురైన ఓటమి కంటే రెండింతలు ఘోరంగా 2026లో అన్నాడీఎంకే ఓటమి పాలు కావడంతథ్యమని వ్యాఖ్యలుచేశారు. దక్షిణ తమిళనాడులో అన్నాడీఎంకే ఇక గల్లంతయ్యే పరిస్థితులు తప్పదని హెచ్చరించారు.
పళణి సెంగొట్టయన్


