త్యాగానికి ప్రతీక .. పొట్టి శ్రీరాములు
కొరుక్కుపేట: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి ప్రతీక అని అమరజీవి పొట్టిశ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ కె. అనిల్‌కుమార్‌రెడ్డి కొనియడారు. చైన్నె మైలాపూర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వేడుకలో కమిటీ ఛైర్మన్ కె.అనిల్ కుమార్ రెడ్డితోపాటూ సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కార్యవర్గ సభ్యులు గుడిమెట్ల చెన్నయ్య, ఎం వి. నారాయణ గుప్తా , జె ఎం.నాయుడు, ఆచార్య విస్తాలి శంకరరావు, డాక్టర్ ఏవీ శివకుమారి కలసి అమరజీవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సాధనకొరకు ఆమరణదీక్ష చేసి.. ప్రాణాలు అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ సభలో పాల్గొన్న వక్తలు మాట్లాడారు. ముందుగా కె. అనిల్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంకోసం ప్రాణాలు విడిచిన స్థలంలో ఈ వేడుకలను జరుకోవడం మరింత ఆనందంగా ఉందన్నారు. ఆయన ప్రాణత్యాగంతో దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయని గుర్తు చేశారు. ఇంకా పలువురు వక్తలు పేర్కొంటూ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఇంకా ఈ వేడుకల్లో ఊరా ఆంజనేయులు ,తెలుగు ప్రముఖులు పాల్గొన్నారు.


