ఆధునిక స్కానర్లతో కరూర్‌లో సీబీఐ దర్యాప్తు
– విజయ్ భద్రతకు రిటైర్డ్ పోలీసు అధికారుల బృందం
సాక్షి, చైన్నె: కరూర్ విషాద ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. అత్యాధునిక స్కానర్లను ఉపయోగించి దర్యాప్తు శనివారం జరిగింది. వేలుస్వామి పురానికి ఈ స్కానర్ ద్వారా 360 డిగ్రీలు పరిశీలన చేశారు. టీవీకే నేత విజయ్ ప్రచారంలో చోటు చేసుకున్న ఘోర ఘటనను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. తమ విచారణలో భాగంగా శనివారం కొన్ని గంటల పాటూ వేలు స్వామిపురం ప్రధాన మార్గంను సీబీఐ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ మార్గంలో వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ మార్పులు చేశారు. సీబీఐ అధికారులు అత్యాధునిక స్కానర్‌ను వెంట బెట్టుకొచ్చారు. దీని ఆధారంగా వేలుస్వామిపురంలో సమగ్ర పరిశీలన చేశారు. ఇక్కడున్న దుకాణాలు, గృహాలు, రోడ్డు , ఆ పరిసరాలన్నీ పరిశీలించారు. ఇందులో వెలుగు చూసే వివిధ అంశాల ఆధారంగా అక్కడి దుకాణ దారుల వద్ద విచారణ వేగవంతంచేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ ఘటనతో ఆగిన విజయ్ ప్రచార పయనం మళ్లీ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీవీకే వర్గాలు దృష్టి పెట్టారు. ఈసారి తన ప్రచారాలలో భద్రతా పర్యవేక్షణ, ఏర్పాట్లపై దృష్టి పెట్టే దిశగా 15 మంది రిటైర్డ్ పోలీసు అధికారులతో ఒక బృందాన్ని నియమించే పనిలో విజయ్ నిమగ్నమైనట్టు సంకేతాలు వెలువడ్డాయి.


