సీజనల్ వ్యాధులపై దృష్టి
సాక్షి, చైన్నె : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు విస్తృతం చేశామని ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ తెలి పారు. డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి జ్వరాలు కట్టడిలో ఉన్నాయన్నారు. ఆరోగ్య మంత్రి ఎం సుబ్రమణియన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమై 15 రోజులైనట్టు తెలిపారు. వర్షాల సీజన్‌లో వచ్చే వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు విస్తృతం చేశామన్నారు. ఇప్పటి వరకు 16,648 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా 76 వేల మంది ప్రయోజనం పొందినట్టు తెలిపారు. ఈ శిబిరాల ద్వారా జ్వరాల తీవ్రత అధికంగా ఉన్న కేసులను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో జ్వరాల వ్యాప్తిని కట్టడి చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఏ ప్రాంతంలోనైనా సరే ముగ్గురు జ్వరంతో ఉన్నట్టు తెలిసిన పక్షంలో తక్షణం అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం డెంగీ బారిన 18,725 మంది పడ్డారని, వీరిలో తొమ్మిది మంది మరణించినట్టు పేర్కొన్నారు. తాజాగా డెంగీ, మలేరియా, చికున్ గున్యా జ్వరాలు కట్టడిలో ఉన్నాయని తెలిపారు. ఎవరైనా జ్వరంతో బాధ పడుతుంటే తక్షణం ఆస్పత్రులకు వెళ్లి వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం మానుకోవాలని హితవు పలికారు.


