వేలూరు, తిరువణ్ణామలైలో ఇందిరాగాంధీ వర్ధంతి
వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుపుకున్నారు. ముందుగా వేలూరు అన్నా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకా రామన్ అధ్యక్షతన జిల్లా కోశాధికారి సీకే దేవేంద్రన్, ఉపాద్యక్షుడు పీపీ చంద్రప్రకాష్, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు వాహీద్‌బాషా, ఆ పార్టీ ఎస్సీ, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తరంజన్ తదితరులు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధానిగా ఎన్నికై ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకై క నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. అనంతరం కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కాట్పాడి గుణశీలన్, మహిళా నాయకురాలు కాంచన, అరియూరు సోము, రగు, తులసి, తదితరులు పాల్గొన్నారు. అలాగే తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ కార్యకర్తలు ఇందిరాగాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.


