వైభవంగా శ్రీవారి పుష్పయాగం
కొరుక్కుపేట: చైన్నె, పెరంబూరు పటేల్ రోడ్డులోని శ్రీవేంకటేశ్వర భక్త సమాజం (ఆనంద నిలయం) ఆధ్వర్యంలో శ్రీవారి పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. ప్రతి వేంకటేశ్వర స్వామివారికి పెద్ద ఎత్తున పెరటాసి ఉత్సవాలు, శ్రీవారి కల్యాణోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. సమాజం తరఫున 56వ వార్షిక పెరటాసి మాస ఉత్సవం, శ్రీనివాస కల్యాణ వైభవం, 48వ వార్షిక పెరంబూరు నుంచి తిరుమలకు పాదయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేంకటేశ్వర స్వామివారికి కృతజ్ఞత తెలుపుతూ శ్రీవేంకటేశ్వర భక్త సమాజం అధ్యక్షుడు తమ్మినేని బాబు అధ్యక్షతన శ్రీవారి పుష్పయాగం గురువారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. ఇందులో సువాసనలు వెదజల్లే 20 రకాల పువ్వులతో అభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త డి. జంబు, అడ్వకేట్ వెంకటశేషయ్య హాజరయ్యారు. శ్రీవేంకటేశ్వర భక్త సమాజం ఉపాధ్యక్షుడు కే వెంకట్రాజు, కార్యదర్శి ఎస్ వెంకట్రామన్, కోశాధికారి పి. కోదండ రామయ్య, సంయుక్త కోశాధికారి హెచ్ వెంకటరమణుడు పాల్గొన్నారు. సుమారు 200 మంది భక్తులు పాల్గోని గోవిందా గోవిందా అంటూ శ్రీవారి సేవలో తరించారు. చివరిగా భక్తులకు అన్న ప్రసాదాలను అందజేశారు.


