మీతో స్టాలిన్‌కు వినతుల వెల్లువ
– ఒకే రోజు పది వేలకు పైగా వినతులు
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన మీతో స్టాలిన్ శిబిరానికి ఒకే రోజు పది వేలకు పైగా వినతులు వెల్లువల్లా వచ్చి పడ్డాయి. ప్రజల వద్దకే పాలను తీసుకొచ్చేలా అన్ని శాఖలకు చెందిన అధికారులను ఒకే చోట సమన్వయం చేసి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే పూండి యూనియన్‌లోని కై వండూర్, కడంబత్తూరు యూనియన్‌లోని దిగువనల్లాటూరు, సేలై, తిరునిండ్రవూర్, పాక్కం, ఆవడి, అంబత్తూరు, గుమ్మిడిపూండి, పొన్నేరి, పూందమల్లి సహా 40 ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి రేషన్‌కార్డులు, ఆధార్ మార్పులు చేర్పులు, పట్టా, పక్కాగృహాలు, ఉచిత ఇంటి స్థలం, జనన మరణ ధ్రువీకరణ, ఆదాయం, కుల, శాశ్వత నివాసాలకు చెందిన సర్టిఫికెట్‌ల కోసం వినతులను ప్రజలు ఆయా శాఖలకు చెందిన అధికారులకు సమర్పించారు. కై వండూరు, దిగువ నల్లాటూరు గ్రామాల్లో జరిగిన శిబిరానికి ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కై వండూరులో ఏల్ల తరబడి నివాసం వుంటున్న ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ స్థానికులు వినతి పత్రం సమర్పించారు. శిబిరంలో ఆర్డీఓ రవిచంద్రన్, తహసీల్దార్ బాలాజి, ఆర్‌ఐ దినేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


