మోటివేట్ చేసే ఐఏఎస్ కన్నమ్మ
తమిళసినిమా: వాణిజ్య విలువలతో కూడిన చిత్రాల ఒరవడిలో మంచి సందేశాత్మక కథా చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. పట్టుదలతో శ్రమిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చునని అందుకు పేదరికమే కాదు ఎలాంటి సమస్యలు అడ్డుకావని చెప్పే కథాశంతో తెరకెక్కిన చిత్రం ఇది. ఒక కుగ్రామంలో ఇంటింటికీ వెళ్లి బట్టలు తీసుకెళ్లి ఉతికే ఒక పేద తండ్రి కూతురు ఒక పూట కడుపునిండా తినడానికి కూడా లేనంత పేదరికాన్ని అనుభవిస్తుంది. అలాంటి చిన్నారికి ప్రజాసేవకుడు అయిన ఆ గ్రామ పెద్ద అండగా నిలుస్తాడు. దీంతో ఈ చిన్నారి తన జీవిత లక్ష్యమైన కలెక్టర్ ఎలా అయ్యిందీ అనే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. అయితే తను ఈ స్థాయికి చేరుకోవడానికి అడుగడుగునా ఎన్ని కష్టాలు అనుభవించింది, ఎన్ని అవమానాలు భరించింది, వాటిని ఎలా ఎదురొడ్డింది అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రం ఐఏఎస్ కన్నమ్మ. చక్కని మోటివేషన్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాయప్పస్వామి ఫిలింస్ పతాకంపై టి.రాజాచోళన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించి ప్రధాన పాత్రను పోషించి నిర్మించారు. నటి ప్రిన్సీ, ఆట్టుకుట్టి, అరవంద్‌బాబు ముఖ్యపాత్రలను పోషించిన ఈ చిత్రానికి కేశవన్ చాయాగ్రహణం, అరవింద్‌బాబు సంగీతాన్ని అందించారు. ఈచిత్రం శుక్రవారం తెరపైకి రానుంది.


