సమస్యల పరిష్కారానికి ధర్నా
వేలూరు: దీర్ఘ కాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు సంయుక్తంగా వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు జ్ఞానశేఖరన్ అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వినోద్‌కుమార్ మాట్లాడారు. గ్రామ పంచాయతీలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెలా రూ.10 వేలు వేతనం చెల్లించాలని, వేతనం ఇవ్వడాన్ని కాంట్రాక్టులు వదలకుండా గ్రామ పంచాయతీనే నేరుగా ఇచ్చేలా చూడాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీలోని కార్యదర్శులకు ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకుల నుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేసే పంపు ఆపరేటర్లకు రూ.15 వేలు వేతనం ఇవ్వాలని తదితర మొత్తం 15 డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విశ్వనాథన్, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


