కారు ఢీకొని
దంపతులు దుర్మరణం
తిరువొత్తియూరు: కారు ఢీకొన్న ఘటనలో నడిచి వెళుతున్న దంపతులు దుర్మరణం చెందారు. ఈ ఘటన నత్తం వద్ద చోటుచేసుకుంది. దిండుక్కల్ జిల్లా నత్తం సమీపం పచ్చాలై ప్రాంతానికి చెందిన రాజా (50). ఇతని భార్య పెసలి (45). వీరి కుమార్తె ఇంటి సమీపంలోనే వేరుగా ఉంటోంది. మంగళవారం రాత్రి కూతురి ఇంట్లో ఉండి, బుధవారం తెల్లవారుజామున తమ ఇంటికి వెళ్లడానికి నత్తం–తువరన్కురిచ్చి జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో నత్తం నుంచి చైన్నె వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈఘటనలో దంపతులు ఇద్దరు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న నత్తం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిండుగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌ను మాడసామిని అరెస్ట్ చేశారు.
విద్యుత్‌షాక్‌తో డీఎంకే నేత..
తిరువళ్లూరు: విద్యుత్‌షాక్‌కు గురై డీఎంకే యువజన విభాగం ఉపకార్యదర్శి శిలంబరసన్ మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా పేంబాక్కం ప్రాంతానికి చెందిన దురైకుమారుడు శిలంబరసన్(35). ఇతను డీఎంకే యువజన విభాగం ఉప కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇతడికి వివాహమై భార్య, కుమార్తె వున్నారు. ఈక్రమంలో ఇరుళంజేరిలోని తన దుకాణం వద్దకు బుధవారం వెళ్లిన శిలంబరసన్ తెగిపడిన విద్యుత్ వైర్‌ను తొక్కడంతో షాక్‌కు గురై సంఘటన స్థఽలంలోనే మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కోత యంత్రం పడి వడ్రంగి..
తిరువొత్తియూరు: తిరునిన్రవూరులో కోత కోసే యంత్రం పడి వడ్రంగి కార్మికుడు మరణించాడు. తిరునిన్రవూరు పళ్లక్కళని తిరు.వి.క.నగర్‌కు చెందిన కార్తీక్ (33) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగించేవాడు. అతనికి పెళ్లి కాలేదు. అతని తండ్రి ఢిల్లీ అనారోగ్య కారణాలతో నాలుగేళ్ల కిందట మరణించాడు. కార్తీక్ తల్లి భాను (60)తో కలిసి నివసిస్తున్నాడు. ఈ పరిస్థితిలో మంగళవారం కార్తీక్ తన ఇంట్లో పాడైపోయిన చెట్టు కోసే చేతి యంత్రాన్ని బాగు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సమయంలో యంత్రం పని చేయడంతో, అది అతని చెయ్యి, మెడ, ముఖం భాగాల్లో పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కార్తీక్ సంఘటనా స్థలంలోనే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న తిరునిన్రవూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఏనుగు దాడిలో రైతు..
తిరువొత్తియూరు: కృష్ణగిరి సమీపంలో అడవి ఏనుగు దాడిలో ఒక రైతు మృతి చెందాడు. మృతదేహంతో గ్రామస్తులు రహదారి దిగ్బంధం చేయడంతో తీవ్ర కలకలం రేగింది. కృష్ణగిరి జిల్లా నార్లపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ (50) రైతు. ఎప్పటిలాగే మంగళవారం రాత్రి తన పొలానికి కాపలాగా వెళ్లాడు. ఆసమయంలో అక్కడ ఉన్న ఒక అడవి ఏనుగు వేణుగోపాల్‌ను అడ్డగించి దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వేణుగోపాల్ అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళుతున్న ప్రజలు వేణుగోపాల్ మృతి చెంది ఉండడాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం అందజేశారు. వెంటనే గ్రామస్తులు అడవి ఏనుగుల కారణంగా తమ ప్రాణాలకు రక్షణ కరువైందని పేర్కొంటూ మృతదేహాన్ని రహదారిపై ఉంచి రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ మురళి ఆందోళనకారులతో చర్చలు జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మరణంలోనూ వీడని బంధం
–భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మృతి
అన్నానగర్: అరియలూర్ సమీపంలో భార్య మరణాన్ని తట్టుకోలేని భర్త కూడా స్పృహతప్పి పడిపోయి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. అరియలూర్ జిల్లా ఉదయర్‌పాళయం సమీపం అయ్యప్పన్ నాయకన పేటై కోయిల్ వీధిలో వర్థనసామి (64), భార్య రాణి (57) దంపతులు ఉన్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా రాణి అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆమె మరణించింది. సాయంత్రం రాణి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భార్య మరణంతో దుఃఖంలో ఉన్న వర్థనసామి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. దీంతో అతని బంధువులు దిగ్భ్రాంతి చెంది, ఆయన వద్దకు వెళ్లి చూసేసరికి, అతను చనిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నింపింది.
ఏనుగు మృతిపై విచారణ
తిరువొత్తియూరు: మేట్టుపాళయం వద్ద అగడ్త (ఊబి)లో కూరుకుపోయి మగ ఏనుగు మృతిపై అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం – ఊటీ రోడ్డులో ఓడనురై రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా పక్కన తిరుమలైరాజ్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమి ఉంది. దాని పక్కన ఉన్న ఊబి లో బుధవారం ఉదయం ఒక అడవి ఏనుగు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఫారెస్ట్ రేంజర్ శశికుమార్ నేతృత్వంలోని అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ విషయంపై జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ జయరాజ్‌కు సమాచారం అందించారు. అటవీ పశువైద్యులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.


