నాణ్యత లోపించిందని రాస్తారోకో
వేలూరు: రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిందని గ్రామస్తులు రాస్తారోకో చేశారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 60 వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ పనులతోపాటు కావేరి తాగునీటి పైపులైన్ పనులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వార్డుల్లో మాత్రమే పనులు పూర్తి అయినప్పటికీ అధికమైన వార్డుల్లో పనులు గత ఐదేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. ఇదిలాఉండగా పది రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉండడంతో కాట్పాడి ప్రాంతంలోని తిరునగర్‌లో వర్షపు నీటితో పాటు, డ్రైనేజీ నీరు కలుషితమై వీధుల్లోకి చేరింది. దీంతో వీధుల్లోని రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులు ఈ ప్రాంతాలను తనిఖీ చేసి స్మార్ట్ సిటీ పథకం కింద పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో బుధవారం ఉదయం కార్పొరేషన్ అధికారులు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే పనుల్లో నాణ్యత లేదని నాసిరకంగా రోడ్డు పనులు చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించడంతో పాటు పనులు చేస్తున్న జేసీబీ యంత్రాన్ని అడ్డుకొని పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికులతో చర్చలు జరిపి రాస్తారోకోను విరమింప జేశారు.


