
బోల్తా పడిన కారు
అన్నానగర్: కాలువలో కారు పడిన ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. తెన్‌న్‌కాసి జిల్లా శంకరన్‌కోవిల్‌కు చెందిన కార్తీక్ (24), మధుబాలన్ (23), శ్రీధర్ (24). కన్యాకుమారి జిల్లా మార్తాండంకు చెందిన సంజయ్ (23). ఇతను మధుబాలన్ బంధువు. ఆ నలుగురు స్నేహితులు ఊటీకి ప్రయాణం కోసం కారులో బయలుదేరారు. కార్తీక్ కారు నడుపుతున్నాడు. విరుదునగర్ నాలుగు లేన్ల రహదారిపై ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ ఎదురుగా బుధవారం ఉదయం వెళతుండగా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని స్తంభాన్ని ఢీకొని కాలువలో పడింది. ఈ ప్రమాదంలో సంజయ్ మృతిచెందాడు. కార్తీక్, మధుబాల తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కాలువ బురదలో నుంచిసంజయ్ మృతదేహాన్ని వెలికి తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జైల్లో ఖైదీ మృతి
వేలూరు: వేలూరు సెంట్రల్ జైలులో ఓ ఖైదీ మృతిచెందాడు. తిరువణ్ణామలై జిల్లా ఆరణి సమీపంలోని కొంగల్లి గ్రామానికి చెందిన శంకర్ (77) లైంగిక వేధింపుల కేసులో ఆరణి మహిళా పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. గత 2023 మార్చి 30వ తేదీన శంకర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రస్తుతం శంకర్ వేలూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈనేపత్యంలో శంకర్‌కు గత నెల 20వ తేదీన కిడ్నీ సమస్యతో బాధ పడుతుండడంతో జైలు అధికారుల ఆదేశాల మేరకు శంకర్ వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. జైలు అధికారులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేస్తున్నారు.
ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
అన్నానగర్: శ్రీపెరంబుదూర్‌లో తన ప్రియుడి మృతిని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్ కాచిపట్టు ప్రాంతానికి చెందిన భూపతి (21). అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న రంజనిని ప్రేమించాడు. గత 11వ తేదీన భూపతి, రంజని మధ్య గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం కి గురైన భూపతి గత 11వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన వల్లే భూపతి ఆత్మహత్య చేసుకున్నాడని రంజని తీవ్ర మనస్తాపానికి గురైంది. బూధవారం తెల్లవారుజామున, రంజని తల్లిదండ్రులు మేల్కొని చూసేసరికి, రంజని ఫ్యాన్‌కు మృతదేహంగా వేలాడుతూ కనిపించింది. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఏనుగు దాడిలో కార్మికుడి మృతి
తిరువొత్తియూరు: ఏనుగు దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈరోడ్ జిల్లా కడంబూరు కొండ ప్రాంతం ఏలంజియంకు చెందిన ప్రభు (38).ఇతను అదే ప్రాంతానికి చెందిన రైతు ప్రకాష్‌కు చెందిన వ్యవసాయ తోటలో కూలీ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇతను రాత్రి పూట అరటి పండ్ల తోట వద్ద రాత్రి వేళల్లో కాపలా వుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కాపలా కాస్తుండగా అర్ధరాత్రి అక్కడికి ఏనుగు వచ్చింది. దీంతో ఇరుగుపొరుగుతో కలిసి ప్రభు ఏనుగును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో ఏనుగు ప్రభుపై కాళ్లతో తొక్కి దాడి చేసింది. దీంతో ప్రకాష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కడంబూరు అటవీశాఖ అధికారులు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, ఏనుగును అడవిలోకి వెళ్లగొట్టారు. ప్రభు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సత్యమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయులపై దాడి
– ఐదుగురు ప్లస్‌టూ విద్యార్థుల తొలగింపు
అన్నానగర్: ఉపాధ్యాయులపై దాడి కేసులో ఐదుగురు ప్లస్‌టూ విద్యార్థులను కళాశాల నుంచి తొలగించారు. కడలూరు జిల్లాలోని వేపూర్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ట్రైనీ టీచర్‌గా పోయనప్పడి గ్రామానికి చెందిన దురైరాజ్ కుమారుడు మణికంఠన్ (24) పనిచేస్తున్నాడు. మంగళవారం ఉదయం 11వ తరగతి విద్యార్థులకు త్రైమాసిక పరీక్ష జరుగుతుండగా, ప్లస్‌టూ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత వారు గది తలుపు, కిటికీలు తట్టి ప్రశ్నాపత్రం గురించి వాదించుకున్నారు. కానీ టీచర్ వారిని పరీక్ష గదిలోకి అనుమతించలేదు. దీని కారణంగా, విద్యార్థులు మణికంఠన్‌పై దాడి చేశారు. వారిని ఆపిన ఉపాధ్యాయుడిపై కూడా దాడి చేశారు. దీనిపై మణికంఠన్ వేపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం, ఐదుగురు ప్లస్–2 విద్యార్థులపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేశారు. తరువాత వారిని కడలూరులోని జువైనెల్ స్కూల్‌కు పంపారు. ఈ స్థితిలో, ప్రధానోపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థులను పాఠశాల నుంచి తొలగించారు.