
స్టూడెంట్ స్పెషల్ !
సాక్షి, చైన్నె: విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు నగర రవాణా సంస్థ చర్యలు చేపట్టింది. 23 మార్గాలను ఎంపిక చేసిన ప్రత్యేక బస్సులను ఉదయం, సాయంత్రం వేళలో మాత్రం నడిపేందుకు నిర్ణయించారు. చైన్నె నగరంలో పలు మార్గాలలో విద్యా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. పూందమల్లి హైరోడ్డు, కామరాజర్ సాలై పరిసర మార్గాలలోని విద్యా సంస్థలలో చదువుకునే విద్యార్థులు నిత్యం బస్సులలో రగడ సృష్టించడం సాధారణంగా మారింది. ఫుడ్ బోర్డులో వేలాడటం,బస్సులలో ఆట పాటలతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందికలిగించడం లేదా, డ్రైవర్‌ను తీవ్ర ఆ గ్రహానికి గురి చేయడం వంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. దీంతో అనేక మార్గాలలో ఉదయం, సాయంత్రం వేళలో అకతాయి తనంతో వ్యవహరించే విద్యార్థుల భరతం పట్టే విధంగా పోలీసులు నిఘాతో వ్యహరిస్తుంటారు.అయినా, ఎక్కడో ఒక చోట విద్యార్థుల గ్రూప్ వార్ సైతం బస్సులలో వెలుగు చూస్తుంటుంది. ఈపరిణామాలను పరిగణించి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా, విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను 23 మార్గాలలో ఉదయం, సాయంత్రం వేళలో నడిపేందుకు ఎంటీసీ వర్గాలు కసరత్తులు చేపట్టాయి. ఈ బస్సులలో విద్యార్థినులు, విద్యార్థులు, మహిళలు ప్రయాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్గాలలో ప్రత్యేక బస్సుల మీద పోలీసులు మరింత దృష్టి సారించనున్నారు. విద్యార్థులు తోక ఆడిస్తే చర్యలు తప్పదన్నట్టుగా ముందుకెళ్లబోతున్నారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన నివేదికకు సీఎం స్టాలిన్ ఆమోద ముద్ర వేయగానే రోడ్డెక్కించేందుకు రవాణా సంస్థ వర్గాలు సన్నద్ధవుతున్నాయి.
● చైన్నెలో 23 మార్గాలలో రోడ్డుపైకి