
చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
● 40 సవర్ల నగలు, రూ.2.39 లక్షల నగదు రికవరీ
తిరువళ్లూరు: ఇంటి తాళాలు పగులగొట్టి 40 సవర్ల బంగారు నగలు, రూ.2.39 లక్షల నగదును చోరీ చేసిన కేసులో ఉత్తరాది వారు ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారి నుంచి నగదు, నగలను రికవరీ చేశారు. తిరువళ్లూరు జిల్లా ఉప్పరపాళ్యం ప్రాంతానికి చెందిన స్వామివేలు(49) ఇంట్లో గత 20న గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఇంట్లో వుంచిన నగలు, నగదు చోరీ చేశారు. ఫిర్యాదు మేరకు ఆవడి కమిషనరేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో స్థానికంగా భవన నిర్మాణరంగంలో వుంటున్న కార్మికులు చోరీ జరిగిన ఇంటికి సమీపంలో తరచూ సంచరించినట్టు నిర్ధారించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అంగూర్‌షేక్(32), రాజూషేక్(34) ఇద్దరూ కలిసి తాళాలు పగులగొట్టి బీరువాలో వుంచిన 40 సవర్ల బంగారు నగలు, రూ.2.39 లక్షల నగదును చోరీ చేసినట్టు నేరం అంగీకరించారు. వీరి నుంచి నగలు, నగదును రికవరీ చేసిన పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.