
రోజువారీ చెత్త పన్నులు వసూలు చేయాలి
తిరువళ్లూరు: ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్న భవనాలు, వ్యాపార సముదాయాలు, కట్టడాల నుంచి చెత్తకుప్పల సేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తిరువళ్లూరులో అమలు చేయాలని కౌన్సిలర్ థామస్ సూచించారు. తిరువళ్లూరు మున్సిపాలిటీ సాధారణ సమావేఽశఽం శుక్రవారం ఉదయం చైర్‌పర్సన్ ఉదయమలర్‌పాండ్యన్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి వైస్ చైర్మన్ రవిచంద్రన్, కమిషనర్ దామోదరన్ హాజరయ్యారు. సమావేశంలో కౌన్సిలర్ థామస్ మాట్లాడుతూ ఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న హాటళ్లు, కల్యాణమండపాలు, షాపింగ్‌మాళ్లు, సూపర్‌మార్కెట్‌లు, ప్రైవేటు వైద్యశాలలు, వ్యాపార వాణిజ్య సముదాయాల నుంచి చెత్తసేకరణకు దినసరి పన్నులు వసూలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయని, వాటిని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ కౌన్సిలర్ కౌన్సిల్ దృష్టికి తెచ్చిన విషయాన్ని అమలు చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని వాటిని అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పార్క్‌లను కొందరు అక్రమించుకుని కట్టడాలు నిర్మిస్తున్నారని, అయితే సంబంధిత కట్టడాలకు మున్సిపల్ ప్లానర్ లంచం తీసుకుని అనుమతి కూడా ఇస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ భూమిని అక్రమించుకుని కడుతున్న నిర్మాణాలకు ప్రభుత్వ అధికారులు ఎలా అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీంతో పాటు మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు శాంతి, సుమిత్ర, అరుణ, అయూబ్, సెల్వకుమార్, జాన్, ప్రభాకరన్ పాల్గొన్నారు.