
అర్హులకు కలైంజ్ఞర్ ఆరోగ్యశ్రీ కార్డు
వేలూరు: కలైంజ్ఞర్ ఆరోగ్యశ్రీ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హులైన వారికి అందజేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు. వేలూరు యూనియన్ పరిధిలోని సెంబేడు గ్రామ పంచాయతీ, గంగనల్లూరు గ్రామ పంచాయతీలో మీతో స్టాలిన్ పథకం ఆయా గ్రామ సర్పంచ్‌ల అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హజరై కలైంజ్ఞర్ ఆరోగ్య శ్రీకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అక్కడిక్కడే కార్డులను అందజేశారు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ పథకంలో మొత్తం 15 శాఖలకు సంబంధించిన అధికారులను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు దరఖాస్తు చేసుకున్న వినతులపై వెంటనే విచారణ జరిపి, అర్హులైన వారికి న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి వినతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్జీదారులకు రశీదు అందజేయాలన్నారు. అఽధికారులు ఆలసత్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం ప్రజల రిజిష్టర్ నమోదు కేంద్రం, రశీదు అందజేసే కేంద్రం తదితర వాటిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వేలూరు యూనియన్ చైర్మన్ అముద, బీడీఓ విన్‌సంట్ రమేష్‌బాబు, డీఎంకే యూనియన్ చైర్మన్ జ్ఞానశేఖరన్, సర్పంచ్ అన్బయగన్ పాల్గొన్నారు.