
ఉద్యోగ విరమణ రోజే సస్పెన్షన్
సాక్షి, చైన్నె: అన్నావర్సిటీ మాజీ వీసీ వేల్‌రాజ్‌పై ఆ విద్యా సంస్థ సిండికేట్ కన్నెర్ర చేసింది. నాగర్‌కోయిల్‌కు చెందిన వేల్‌రాజ్ 1992 నుంచి గిండిలోని అన్నావర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 20024 నుంచి 2010 వరకు డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 2021లో అన్నావర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈ పదవీ కాలం 2024లో ముగిసినప్పటికీ, ఉద్యోగ విరమణకు సంబంధించిన నిర్ణీత వయస్సు రాక పోవడంతో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ వచ్చారు. అదే సమయంలో ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి. కొన్నింటిపై విచారణ సాగుతూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో జూలై 31న ఆయన ఉద్యోగ విరమణ రోజు. అయితే, అదే రోజున అన్నావర్సిటీ సిండికేట్ సమావేశం జరిగింది. ఇందులో ఆయన్ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగ విరమణ రోజే ఆయన్ను సస్పెండ్ చేయడం అన్నావర్సిటీలో చర్చకు దారి తీసింది.
చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
●ఒడిశా యువకుడిపై పోక్సో కేసు
తిరుత్తణి: చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఒడిశాకు చెందిన యువకుడిని పోక్సో చట్టం కింద కనకమ్మసత్రం పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. కనకమ్మసత్రం ప్రాంతంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు చేస్తూ అదే ప్రాంతంతో 50కు పైగా కార్మికులు తాత్కాలిక షెడ్లు నిర్మించుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో కనకమ్మసత్రం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక గురువారం ఉదయం ఇంటికి సమీపంలో బహిర్భూమికి వెళ్లింది. అక్కడ దాగి ఉన్న యువకుడు బాలికపై లైంగికదాడికి యత్పించడంతో బాలిక కేకలు పెట్టింది. ఇది విన్న స్థానికులు చుట్టిముట్టి యువకుడిని చితకబాది పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కనకమ్మసత్రం సీఐ నరేష్ కేసు నమోదు చేసి ఎరోమల్‌అలీ(27) అనే వ్యక్తిని పోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
సబర్బన్ రైలు మార్గం విస్తరణకు ఆమోదం
సాక్షి, చైన్నె : ఉత్తర చైన్నె పరిధిలో సబర్బన్ రైలు మార్గం విస్తరణకు దక్షిణ రైల్వే యంత్రాంగం ఆమోద ముద్ర వేసింది. రైల్వే బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్తిపట్టు– గుమ్మిండి పూండి మధ్య మూడు, నాలుగో రైల్వే మార్గానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని మోర్ మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గుమ్మిండి పూండి వైపుగా ఎలక్ట్రిక్ సబర్బన్ రైలు సేవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ రైళ్లు అన్నీ ఒకే మార్గంలో పయనిస్తున్నాయి. ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల అత్యధికంగా పయనిస్తుంటాయి. దీంతో సబర్బన్ రైలు సేవలలో జాప్యం తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ రైళ్లు ఎక్కడికక్కడ స్టేషన్లలో ఆగిఆగి పయనించాల్సి ఉంది. ఈ సమస్యను అధిగమించేలా సబర్బన్ రైల్వే మార్గాన్ని విస్తరించాలన్న నినాదం ఆది నుంచి మిన్నంటుతూ వస్తుంది. ప్రస్తుతం దీనికి మోక్షం లభించింది. రైల్వే బోర్డు సమావేశంలో తీర్మానించడమే కాకుండా, ఈ పనులకు రూ.374 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు.
20న పోషకాహార కార్మికుల సమ్మె
కొరుక్కుపేట: పోషకాహార భోజన కార్మికులు ఈ నెల 20వ తేదీన నిరసన ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఆ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖరన్ మాట్లాడుతూ పోషకాహార రంగంలో ఖాళీగా ఉన్న 60 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరంసహా వివిధ డిమాండ్లను నొక్కి చెబుతూ తాము కొన్ని సంవత్సరాలుగా అనేక దశల నిరసనలు నిర్వహిస్తున్నామన్నారు. అయితే, ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు. దీంతో తాము 7 దశల నిరసనలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మొదటి దశలో ఈ నెల 20వ తేదీన జిల్లా రాజధానుల్లో ఒకరోజు సమ్మె జరుగుతుందన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 20న తిరుచ్చిలో సమ్మె సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత, అక్టోబర్ 8న యాదృచ్ఛిక సెలవు నిరసనను, నవంబర్ 7న చైన్నెలో ర్యాలీని నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 17న ఒకరోజు సమ్మె నిర్వహిస్తామని చెప్పారు.
పోలీసులపై ఖైదీల దాడి
కొరుక్కుపేట: చైన్నెలో పోలీసులపై ఖైదీలు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. చైన్నెలోని అ న్నానగర్ రౌడీ రాబర్ట్ హత్య కేసులో అరెస్టయి, జై లులో ఉన్న నిందితులను గురువారం పోలీసులు ఎగ్మోర్ క్రిమినల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత, నిందితులను పోలీసు వాహనంలో తిరిగి పుళల్ జైలుకు తరలించారు. ఆ సమయంలో గార్డులు ఖైదీలను దుర్భాషలాడారు. దీంతో పోలీసులపై ఖైదీలు దాడి చేస్తున్న దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. వీడియో ఫుటేజ్ ప్రామాణికతను, హత్య కేసులో అరెస్టు చేసిన నిందితుడిని తీసుకువచ్చిన పోలీసు అధికారులను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి ఫిర్యాదు నమోదు చేయకపోవడం గమనార్హం.