
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు!
సాక్షి, చైన్నె : బీజేపీతో పొత్తుప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో స్పష్టం చేశారు. మళ్లీ డీఎంకే అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఎండీఎంకే నేత వైగో రాజ్యసభ పదవీ కాలం గత నెల ముగిసిన విషయం తెలిసిందే. ఆయనకు మళ్లీ అవకాశం దక్కుతుందని ఎండీఎంకే వర్గాలు ఎదురుచూశాయి. అయితే డీఎంకే కరుణించ లేదు. అదేసమయంలో ఈ సారి ఎన్నికల్లో ఎండీఎంకే రూటు మార్చే అవకాశాలు ఉన్నాయని, డీఎంకేకు మోసం చేయడం ఖాయం అనే చర్చ ఊపందుకుంది. అదే సమయంలో ఆ పార్టీలో వైగో, ఆయన తనయుడు, ఎంపీ దురైవైగోలతో సీనియర్‌నేత మల్‌లై సత్య ఫైట్ వెలుగులోకి రావడం చర్చకు మరింత బలాన్ని చేకూర్చినట్లైంది. ఈ వివాదానికి డీఎంకే కారణం కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం సీఎం స్టాలిన్‌ను క్యాంప్ కార్యాలయంలో ఎండీఎంకే నేత వైగో, ఎంపీ దురైవైగో భేటీ అయ్యారు. ఆస్పత్రి నుంచి వచ్చినానంతరం స్టాలిన్‌ను పరామర్శించే దిశగా ఈ భేటీ సాగినా, రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నట్టు సమాచారం.
అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ, సీఎం స్టాలిన్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేయడానికి, ఆయన సోదరుడు ముత్తు మరణానికి సంతాపంగా పరామర్శించేందుకు వచ్చినట్టు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 19న ఎండీఎంకే నేతృత్వంలో జరగనున్న అన్నా జయంతి వేడుకల మహానాడుకు హాజరు కావాలని సీఎంను ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వం నేరాల మీద ఉక్కు పాదం మోపుతోందని, తప్పు చేసిన వాళ్లను వదలి పెట్టడం లేదని ఈసందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి మళ్లీ అధికార పగ్గాలు రాష్ట్రంలో చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు కలిగిన బీజేపీతో ఎలాంటి పరిస్థితుల్లోనూ, తాము పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మళ్లీ అధికారంలోకి డీఎంకే
ఎండీఎంకే నేత వైగో