
పళనికి చుక్కెదురు!
● పిటిషన్ తిరస్కృతి
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి కె పళణి స్వామి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలన్న పళనిస్వామి వాదనను కోర్టు తోసి పుచ్చింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా 2022లో పళణి స్వామి ఎంపికై న విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, ఈ కేసును దాఖలు చేసిన వ్యక్తికి అన్నాడీఎంకేతో సంబంధం లేదంటూ పళణి స్వామి తరఫున రిట్ పిటిషన్ దాఖలైంది. తమ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. వాదన అనంతరం పళణిస్వామి వాదనను కోర్టు తిరస్కరించింది. పళణి ఎంపికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ విచారణకు నిర్ణయించింది. సిటీ సీవిల్ కోర్టు నిర్ణయం కాస్త అన్నాడీఎంకేలో చర్చకు దారి తీసింది. పళణి స్వామి ప్రధాన కార్యదర్శి ఎంపిక విషయంగా విచారణను ఎదుర్కోవాల్సి ఉండడంతో ఇది ఎన్ని మలుపులకు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ తప్పడం లేదు. ఇదిలా ఉండగా పళణిస్వామి చేపట్టిన ప్రజా చైతన్యయాత్ర శుక్రవారం తిరునల్వేలిలో బ్రహ్మరథం పట్టేలా జరిగింది. పళని రోడ్ షోకు విశేష స్పందన వచ్చింది. అదే సమయంలో పళణి మూడో విడత పర్యటన షెడ్యూల్‌ను సైతం అన్నాడీఎంకే వర్గాలు విడుదల చేశాయి.