
సస్పెన్స్, థ్రిల్లర్‌గా సరెండర్
తమిళసినిమా: క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ కథ, కథనాలతో తెరకెక్కిన చిత్రం సరెండర్. బిగ్‌బాస్ ఫేమ్ దర్శన్ కథానాయకుడిగా నటించిన ఇందులో మలయాళ నటుడు లాల్, మన్సూర్‌అలీఖాన్, మునీష్‌కాంత్, సుజిత్, పడినే కుమార్, అరోళ్ డి.శంకర్, రమ్య రామకృష్ణన్, సుందరేశ్వరన్, కౌశిక్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈయన దర్శకుడు అరివళగన్ శిష్యుడన్నది గమనార్హం. మెయ్యేంద్రన్ చాయాగ్రహణం, వికాశ్ బడీశా సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్‌వీ.కుమార్ నిర్మించారు. సరెండర్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. కాగా పోలీసుశాఖ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే కథ, కథనాలతో సాగే ఈ చిత్రం ఎన్నికలకు ఐదు రోజుల ముందు జరిగే సన్నివేశాలతో ప్రారంభం అవుతుంది. ఎన్నికలకు ముందు ఒక నటుడు తన పర్సనల్ గన్‌ను పోలీస్‌స్టేషన్‌లో సరెండర్ చేస్తాడు. అది మిస్ అవుతుంది. కాగా అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు ఓట్ల కోసం ప్రజలకు పంపిన నగదు మిస్ అవుతుంది. ఈ రెండు సంఘటనలతో జరిగే కథే సరెండర్. మిస్ అయిన గన్ కోసం పోలీసులు, ఓటర్లకు పంచాల్సిన డబ్బును కనుగొనడానికి రాజకీయ నాయకులు పడే పాట్లే ఈ చిత్రం. చిత్ర కథ బిగువైన స్క్రీన్‌ప్లేతో దర్శకుడు గౌతమ్ గణపతి తెరపై ఆవిష్కరించారు. నటుడు దర్శన్ ట్రైనీ ఎస్‌ఐగా పాత్రకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. ఇక లాల్ పోషించిన పోలీస్ రైటర్ పాత్ర చిత్రానికి కీలకమనే చెప్పాలి. మొత్తం మీద సరెండర్ చిత్రం సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకుంటోంది.