
వ్యవసాయ భూములను సేకరిస్తే ఆందోళన
–అన్బుమణి రామదాస్
తిరువళ్లూరు: వ్యవసాయ భూములను ధ్వంసం చేసి శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే రైతుల తరఫున ఆందోళన చేస్తామని పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణిరామదాస్ అన్నారు. తమిళ ప్రజల హక్కుల పరిరక్షణ పేరుతో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణి వంద రోజుల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే పెద్దపాళ్యం, గుమ్మిడిపూండి, తిరువళ్లూరు ప్రాంతాల్లో గురు, శుక్రవారం పాదయాత్రను నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు అండగా ఉంటామని హామీ సైతం ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరణి నది పరివాహక ప్రాంతాల్లో మూడు పంటలు పండే 1,700 ఎకరాల విస్తీర్ణంతో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాం. రైతులను వంచించి బెదిరింపులకు దిగి వ్యవసాయ భూముల్లో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేసే తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు పోరాటం చేస్తామని హెచ్చరించారు. వ్యవసాయానికి ఉపయోగకరంగా లేని స్థలంలో శాటిలైట్ సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పర్యావరణం కలుషితమైన ప్రాంతంగా గుమ్మిడిపూండి వుందని, అధికారులు చర్యలు తీసుకుని నష్ట నివారణ చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కార్యదర్శి ప్రకాష్, మాజీ కార్యదర్శి సెల్వరాజ్, రమేష్ పాల్గొన్నారు.