
భక్తిశ్రద్ధలతో అన్నకూట మహోత్సవం
కొరుక్కుపేట: చైన్నెలోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నిర్వహించిన ఆడి శుక్రవార అన్నకూట మహోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలపైన శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల వద్ద వాసవాంబకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 102 పాల బిందెలతో మహిళలు ఊరేగింపుగా శ్రీ కన్యకా పరమేశ్వర ఆలయానికి మంగళ వాయిద్యాలు, జై వాసవీ...జైజై వాసవీ నినాదాల నడుమ చేరుకున్నారు. ఆలయంలో వాసవాంబకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషాలంకరణ చేసి, అన్నం రాశిగా పోసి అన్నకూట మహోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు భాస్కర్ పంతులు నేతృత్వంలో అన్నకూట మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి దీపారాధన చేసి, రాశిగా పోసిన అన్నాన్ని ప్రసాదంగా తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి క్లబ్ షావుకారు పేట బృందం నిర్వహించిన భక్తి గీతాలాపన అందరినీ అలరించింది.

భక్తిశ్రద్ధలతో అన్నకూట మహోత్సవం